సెక్స్ రాకెట్ ముఠాకు విద్యార్థులు చెక్!
కోల్ కతా: టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులు అంతర్జాతీయ సెక్స్ రాకెట్ నడుపుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్-నేపాల్ సరిహద్దుల్లో డార్జీలింగ్ కు చెందిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. మెంబర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ యాక్షన్ ఫర్ రూల్ గ్రోత్ (మార్గ్), ఎన్జీవో సంస్థ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డార్జీలింగ్, ఢిల్లీ, హర్యానా పోలీసులు బృందాలుగా ఏర్పడి సెక్స్ రాకెట్ ముఠాకు అడ్డుకట్ట వేశారు.
ప్రధాన నిందితుడు గగన్ వర్మను గుర్గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 2లోని ఇంట్లో హర్యానా పోలీసుల సహాయంతో డార్జీలింగ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. బాలికలు, యువతులను కిడ్నాప్ చేసి వారిని బార్లలో డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇప్పిస్తానని ఆశ కల్పిస్తుంటాడు. ఒప్పుకోని వారిపై ఒత్తిడి తెస్తుంటాడు. ముఖ్యంగా డార్జీలింగ్, నేపాల్, సిక్కిం ప్రాంతాల నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు. గుర్గావ్, ఢిల్లీ ఏరియాలకు వీరిని అక్రమ రవాణా చేస్తుంటారు. ఆ తర్వాత వ్యభిచారం చేయించడం, ఇతర ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తుంటారు. మరో నిందితుడు సున్నీ తమాంగ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు మహిళా, ఇద్దరు పురుష కానిస్టేబుల్స్ టీమ్ లో ఉన్నారు. సిలిగురిలో అడిషనల్ చీఫ్ జస్టిస్ ఎదుట సున్నీ తమాంగ్ ను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
టెన్త్, ఇంటర్ చదివే 12 మంది విద్యార్థులు ఎన్జీవోలో పనిచేస్తున్నారు. ఓ బాలిక ఎన్జీవో సంస్థకు చెందిన కొందరు విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ముఠా సభ్యుడికి పరిచయం చేసింది. జాబ్ కావాలని అడిగిన వాళ్లను ఫొటోలు పంపించమని అడిగారు. 20 నిమిషాల్లోపే వారి పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటితో పాటు జాబ్ అపాయింట్ మెంట్ లెటర్స్ ను మెయిల్ చేశారు. విద్యార్థులు నిందితుల వివరాలను, ఈ ఆధారాలను పోలీసులకు అందజేశారు. జూన్ 8న తొలిసారి పోలీసులకు సమాచారం అందించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయించినట్లు ఛెత్రి తెలిపాడు. రెండోసారి ఇలాగే చేసి జూన్ 9న ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రణిత ముఖియా అనే మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం ఎంత మందిని అదుపులోనికి తీసుకున్న వివరాలపై స్పష్టత లేదు.