సన్నీడియోల్
చంఢీఘర్: గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు, నటుడు సన్నీ డియోల్ ఎన్నికల వ్యయ పరిమితి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేసినట్లు తేలిందని ఎన్నికల అధికారి తెలిపారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రూ. 78,51,592 ఖర్చు చేశారు. నిబంధనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గానికి రూ. 70లక్షల వరకు వ్యయపరిమితి ఉంటుంది. చట్టబద్ధమైన పరిమితి కంటే రూ. 8.51 లక్షలు అధికంగా ఖర్చు చేసినట్లు గురుదాస్‌పూర్ జిల్లా ఎన్నికల కార్యాలయం పోల్ ఖర్చుల తుది నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపినట్లు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
నివేదిక ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ డియోల్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జఖర్ ఎన్నికల ఖర్చు రూ. 61,36,058గా నిర్ణీత పరిమితిలో ఉంది. ఎన్నికల వ‍్యయ పరిమితిపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలో గురుదాస్‌పూర్ జిల్లా ఎన్నికల అధికారి ఎంపీ డియోల్‌కు నోటీస్ పంపారు. కాగా పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రతిపక్షం సన్నీ డియోల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తన పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యమైన విషయాలను సంబంధిత అధికారులతో చర్చించడానికి ఎంపీ సన్నీ డియోల్ ఓ ప్రతినిధిని నియమించుకున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వివిధ వర్గాల నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సన్నీ డియోల్ ఈ ఎన్నికల్లో 82,459 ఓట్ల తేడాతో సునీల్ జఖర్‌ను ఓడించారు.
Comments
Please login to add a commentAdd a comment