న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే విషయంపై తుది నిర్ణయం.. అన్ని పక్షాల వాదనలు విన్న తరువాత తీసుకుంటామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల వేర్వేరు ధర్మాసనాలు 1959లో ఒకలా, 1970లో మరోలా విభిన్న తీర్పులిచ్చాయని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment