సాక్షి, న్యూఢిల్లీ : ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆగ్రాలోని తాజ్ మహల్‌ను ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలగించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజ్ మహల్‌ను తొలగించి ఆ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ అధిపతిగా ఉన్న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని చేర్చిన విషయం తెల్సిందే. 2007లో నిర్వహించిన ఓ పోల్‌లో ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్‌ను యోగి ఆదిత్యనాథ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. మొఘల్ చక్రవరి షా జహాన్ దీన్ని నిర్మించడమే అందుకు కారణం.
తాజ్ మహల్ భారతీయ సంస్కతిని ప్రతిబింబించడం లేదని, అనవసరంగా భారత ప్రభుత్వం దాన్ని పరిరక్షణకు, కొత్త గేట్ల ఏర్పాటుకు 22 లక్షల డాలర్లను తగిలేసిందని గత జూన్ నెలలో ఆదిత్యనాథ్ విమర్శించారు. గతంలో రాష్ట్రాన్ని సందర్శించే విదేశీ ప్రముఖలకు తాజ్ మహల్ చిహ్నాన్ని బహూకరించేవారని, తానొచ్చాక ఆ స్థానంలో రామాయణం, మహాభారతం పుస్తకాలను బహూకరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టానని ఆయన చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని పాటించాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్ మహల్‌ను తొలగించడాన్ని రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా తీవ్రంగా సమర్థించింది. ‘హిందువులు ఏమి కోరుకుంటున్నారో మేము అదే చేస్తున్నాం’ అని బీజేపీ అధికార ప్రతినిధి అనిలా సింగ్ వ్యాఖ్యానించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాజ్ మహల్‌కు విదేశీ సందర్శకుల రాక తగ్గుతూ వస్తోంది. ఒక్క 2012 సంవత్సరంలోనే తాజ్‌మహల్‌ను 7,43,000 విదేశీ పర్యాటకులు సందర్శించగా, అది 2015 సంవత్సరం నాటికి 4,80,000 విదేశీ పర్యాటకులకు పడిపోయింది. అంటే దీని ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏటా వస్తున్న కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందన్నమాట. తాజ్ మహల్ సందర్శనకు విదేశీ పర్యాటకుల నుంచి ఒక్కరికి వెయ్యి రూపాయల చొప్పున, సార్క్ దేశాల ప్రజలకు 530 రూపాయలు, భారతీయులకు 40 రూపాయలు వసూలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడం వల్ల మరింత ఆదాయం పడిపోయే ప్రమాదం ఉంది.
మధ్య యుగాల చరిత్ర బీజేపీకిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలకుగానీ మింగుడు పడదు. అధికారంలోకి వస్తే తమకు అనుకూలంగా చరిత్రను పునర్ రచించడం దాని లక్ష్యం. రాజస్థాన్‌లో ఎక్కువకాలం అధికారంలో వున్న బీజేపీ ప్రభత్వుం అదే చేసింది. హల్దిఘటీ యుద్ధంలో అక్బర్ ఓడిపోయారని పిల్లల చరిత్ర పుస్తకాల్లో మార్పులు చేసింది. వాస్తవానికి ఆ యుద్ధంలో మహారాణా ప్రతాప్ ప్రాణ రక్షణ కోసం రణరంగం నుంచి పారిపోయారు. ప్రముఖ చరిత్రకారులు రాసిన పుస్తకాలను తిరిగేస్తే వాస్తవం ఏదో తెలసుకోవడం పెద్ద కష్టం కాదు. అన్ని మతాలు, అన్ని సిద్ధాంతాలు, అన్ని భావాలు, అన్ని తత్వాలు ఒక్కటేనని నమ్మిన అక్బర్‌ను 2016లో బీజేపీ హిట్లతో కూడా పోల్చింది.
గ్రహాంతర వాసులుంటే మానవులు ఉనికిని చాటేందుకు భూమిపై ప్రసిద్ది చెందిన 115 కట్టడాల చిత్రాలతో 1977లో నాసా శాస్త్రజ్ఞులు వోయగర్ అంతరిక్ష నౌకను రోదసిలోకి పంపించారు. ఆ 115 చిత్రాల్లో తాజ్ మహల్‌కు కూడా చోటు లభించింది. గ్రహాంతరవాసులకు ఆ ఫొటోలు అంది తాజ్ మహల్ చూడడానికి వస్తే మాత్రం అది ఉండక పోవచ్చు. 17 శతాబ్దంలో నిర్మించిన తాజ్ మహల్‌ను ఒకప్పుడు ‘తేజో మహాలయ’ అని పిలిచే శివాలయమని కొన్ని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. రాముడి జన్మస్థలం అంటూ అయోధ్యలోని బాబ్రీమసీదును కూల్చివేసినట్లే శివాలయం అంటూ తాజ్ మహల్‌ను కూల్చివేసే ప్రమాదం లేకపోలేదని హేతువాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment