
ఆక్వా ప్లాంట్ ఘటనపై చర్యలు చేపట్టండి
అధికారులకు కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరు పంచాయతీ పరిధిలోని ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఐదుగురు యువకులు మరణించిన సంఘటనపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని చీఫ్ లేబర్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. స్థానిక అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశాలివ్వాలని, ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా సహాయ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
తన ఆదేశాల అమలుకు అనుగుణంగా చేపట్టిన చర్యలపై 24 గంటల్లోగా నివేదిక అందజేయాలన్నారు. కాగా ఈ ఘటనను కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణిస్తోందని, స్థానిక అధికారుల నుంచి నివేదికలు అందాక తదుపరి చర్యలను చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.