పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్ | take bihar along with kashmir as a package, offers justice markandeya katju | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్

Published Tue, Sep 27 2016 2:17 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్ - Sakshi

పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు పాకిస్థాన్‌కు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. వాళ్లు కశ్మీర్ కావాలంటున్నారని, దాన్ని బ్రహ్మాండంగా ఇచ్చేస్తాం గానీ, దాంతో పాటు తప్పనిసరిగా బిహార్ కూడా తీసుకోవాలని అన్నారు. ఇదంతా ఒక ప్యాకేజిలా ఇస్తామని.. అంతేతప్ప బిహార్ వద్దు, కశ్మీరే కావాలంటే మాత్రం కుదరదని చెప్పారు. ఇలా మాట్లాడుతున్నందుకు ఆయనను దేశద్రోహ నేరం కింద అరెస్టు చేయొచ్చని కూడా కొందరు నాయకులు అన్నారు.

ఇక తనకు ఇప్పుడే పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చిందని.. వాళ్లు కశ్మీర్‌ను వదులుకుంటాం గానీ బిహార్ మాత్రం వద్దని చెప్పారని ఆయన మరో పోస్టులో పెట్టారు. కశ్మీర్ కావాలని అడిగినందుకు వాళ్లు క్షమాపణ చెప్పారని, భవిష్యత్తులో ఎప్పుడూ అలా చేయబోమని హామీ ఇచ్చారని అన్నారు. బిహార్ కూడా తీసుకోవాలన్న ఆలోచనే వాళ్లను విపరీతంగా భయపెట్టిందని తెలిపారు. ఒకప్పుడు అలహాబాద్ యూనివర్సిటీలో తమ ఇంగ్లీషు అధ్యాపకుడు ఫిరాఖ్ గోరఖ్‌పురి తనకు ఒక విషయం చెప్పారని, భారతదేశానికి పాకిస్థాన్‌తో ఎలాంటి ముప్పు లేదు గానీ బిహార్‌తోనే ఉందన్నారని కూడా ఆయన తెలిపారు.

సోషల్ మీడియాలో ఈమధ్య బాగా చురుగ్గా ఉంటున్న మార్కండేయ కట్జు.. తన ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలలో ఈ అంశంపై పోస్టులు పెట్టారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. అయితే తనకు బిహారీలంటే గౌరవం ఉందని, గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు లాంటి దిగ్గజాలు బిహార్ నుంచే వచ్చారని ఆయన అన్నారు. ''పాకిస్థాన్‌కు నిజంగా ఈ ఆఫర్ ఇస్తున్నాననుకుంటున్నారా? నేను చాలామంది గురించి జోకులు వేస్తుంటాను. ఇది కూడా అలాంటి జోకే.. జనానికి సెన్సాఫ్ హ్యూమర్ కాస్త పెరగాలి'' అని తెలిపారు. కట్జు ఇలా అన్నా.. నాయకులు మాత్రం ఆయనను శిక్షించాల్సిందేని పట్టుబట్టారు.

కట్జును వెంటనే అరెస్టుచేయాలని, ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ బిహార్ ప్రధాన అధికార ప్రతినిధి వినోద్ నారాయణ్ ఝా అన్నారు. భారత సమగ్రతను దెబ్బతీసేందుకు జాతివ్యతిరేక శక్తులతో కట్జు ఏమైనా చేతులు కలిపారా అన్న అనుమానాలను సైతం ఆయన లేవనెత్తారు. ఇది కచ్చితంగా దేశద్రోహమే అవుతుందని, కట్జుపై కఠిన చర్యలు తీసుకోవాలని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement