బీఎస్‌ఎఫ్ చరిత్రలో తొలి మహిళా అధికారి
గ్వాలియర్: ఐదు దశాబ్దాల సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) చరిత్రలో దళంలో చేరిన తొలి మహిళా అధికారిగా తనుశ్రీ పరీక్ (25) రికార్డు సృష్టించారు. 52 వారాల శిక్షణ అనంతరం టెకన్‌పూర్ బీఎస్‌ఎఫ్ శిక్షణా కేంద్రంలో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్‌లో 67 మంది అధికారుల దళానికి తనుశ్రీ నాయకత్వం వహించారు. రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన పరీక్, 2014లో యూపీఎస్సీ నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆఫీసర్ ర్యాంకులో బీఎస్‌ఎఫ్‌లో చేరారు.
పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న ఓ యూనిట్‌కు అధికారిగా పరీక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దు భద్రతా దళాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళిక రచిస్తోందన్నారు. మిలిటరీ తర్వాత భూ, వాయు, జలాల్లో పని చేస్తున్న రెండో దళంగా బీఎస్‌ఎఫ్‌ను ప్రశంసించారు. బీఎస్‌ఎఫ్ తొలి రక్షణ రేఖ మాత్రమే కాదని, తొలి రక్షణ గోడ అని పొగిడారు.
ఇటీవల విధి నిర్వహణలో మృతిచెందిన సిబ్బందికి నివాళులర్పించిన రాజ్‌నాథ్.. దళంలోని సమస్యల పరిష్కారానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తోందన్నారు. టెకన్‌పూర్ క్యాంప్‌ను సందర్శించిన సింగ్.. టియర్ స్మోక్ యూనిట్ (టీఎస్‌యూ) రూపొందించిన పీఏవీఏ షెల్ ఫైరింగ్ ప్రదర్శనను తిలకించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు ఉపయోగించే పెల్లట్ గన్ల స్థానంలో ఈ షెల్‌లను వినియోగించనున్నారు.