
ఎన్నికలకు ముందే తెలంగాణ: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: 2014 సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమని, ఎన్నికలకు ముందే టీ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలసి అఫిడవిట్లు ఇచ్చే బదులు చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెబితే బాగుంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనానికి ఎటువంటి సంబంధమూ లేదన్నారు. కాంగ్రెస్ పాలనాంశాలకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దని మీడియాకు సూచించారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం ఇక్కడ మీడియాతో దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధినాయకత్వం వెనక్కి తగ్గబోదని మరోమారు నొక్కిచెప్పారు. ‘తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది చేస్తాం. మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు సీమాంధ్ర నేతలు అంగీకరించారు. అన్ని రాజకీయ పార్టీలూ తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పాయి. ఇప్పుడు ఇతర పార్టీలు వెనక్కి తగ్గినా ఇచ్చిన మాటపై కాంగ్రెస్ మాత్రం వెనక్కి తగ్గదు’ అని అన్నారు. ముసాయిదా బిల్లులో లోపాల విషయం తనకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిబంతి వరకు పోరాడతానన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆయన క్రికెటర్ కాబట్టి చివరి బంతి గురించి బాగా తెలుసు’ అని బదులిచ్చారు.
దిగ్విజయ్‌తో బొత్స భేటీ!
గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం సుమారు 15 నిమిషాల పాటు దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియాపై ఇష్టానుసారం మాట్లాడిన సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే విషయంపై చర్చించినట్టు తెలిసింది. పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా జేసీ వ్యవహరిస్తున్నారని, ఆయనని ఉపేక్షించడం సరికాదని బొత్స పేర్కొన్నట్టు సమాచారం. ఇతర పార్టీలతో జేసీ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారనే అంశం కూడా బొత్స ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ, జేసీకి తొలుత షోకాజ్ నోటీసులు పంపి వివరణ తీసుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాల కథనం.