ప్రజా పోరాటాల వల్లనే తెలంగాణ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పడింది తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలపై కాదన్న విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ గ్రహించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లేక పోతే తెలంగాణ వచ్చేదా అని దిగ్విజయ్ ప్రశ్నించడం ఉత్తరకుమారుని ప్రగల్బాల మాదిరిగా ఉన్నాయన్నారు. తెలంగాణపై ఆలోచించడానికి కాంగ్రెస్‌కు 60ఏళ్లు పట్టిం దన్నారు.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దిగ్విజయ్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. అది జన ఆవేదన సభ కాదని, కాంగ్రెస్ ఆవేదన సభ అని శుక్రవారం దత్తాత్రేయ ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతికి, ఉగ్రవాదానికి కళ్లెం వేసి సమ్మిళితమై ఆర్థిక అభివృద్ధికి ప్రధాని మోదీ నాంది పలికారని పేర్కొన్నారు. పేద, బలహీన వర్గాలకు ఆర్థిక సాధికారత కలిగించారన్నారు.