బిడ్డకు జన్మనిచ్చిన పదేళ్ల బాలిక
చండీగఢ్: దగ్గరి బంధువు చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన ఓ పదేళ్ల బాలిక తనకు తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. కడుపులో రాళ్లు ఉన్నాయనీ, ఆపరేషన్ చేయాలని చెప్పి ఆమెను తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలిక గర్భస్రావానికి సుప్రీంకోర్టు గతనెల 28న అనుమతి నిరాకరిండంతో చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం గురువారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించి కాన్పు చేశారు.
ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్ట్, పిడియాట్రిషియన్ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి హరీశ్ తెలిపారు. ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్ సజావుగా సాగిందనీ, శిశువు బరువు (2.2 కేజీలు) కొంచెం తక్కువగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని వెల్లడించారు. బాలిక ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. వైద్య ఖర్చులను చండీగఢ్ పాలనయంత్రాంగం భరిస్తోందని చెప్పారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా బిడ్డను దత్తత ఇవ్వాలని ఆమె తండ్రి ఆసుపత్రి వర్గాలను కోరారు.