Chandigarh girl
-
పదికి పది వికెట్లు
కడప స్పోర్ట్స్: దేశవాళీ మహిళల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కేఎస్ఆర్ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్ సింగ్ గతంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. అయితే బోర్డు గుర్తింపు పొందిన ఒక వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. చండీగఢ్ కెప్టెన్ కూడా అయిన కశ్వీ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్‌ను ఒంటి చేత్తో పడగొట్టింది. 4.5 ఓవర్లు వేసిన ఆమె ఒక ఓవర్ మెయిడిన్ సహా 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తన రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. కశ్వీ బౌలింగ్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే కుప్పకూలింది. జట్టులో 8 మంది డకౌట్ కాగా... ముగ్గురు 10, 4, 3 చొప్పున పరుగులు చేశారు. మరో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అంతకుముందు 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసిన చండీగఢ్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కూడా కశ్వీ (68 బంతుల్లో 49; 6 ఫోర్లు)నే టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్‌గా హినా జైస్వాల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాయుసేనలో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్‌గా చండీగఢ్‌కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ చరిత్ర సృష్టించారు. ఫ్లైట్ ఇంజనీర్‌కు ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన సున్నితమైన విమాన వ్యవస్థలను పర్యవేక్షించడం, ఆపరేట్ చేయగల సామర్ధ్యం అవసరం. భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్ హెలికాఫ్టర్ యూనిట్లలో ఫ్లైట్ ఇంజనీర్‌గా హినా విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతల ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్ నుంచి సున్నితమైన పలు ప్రాంతాల్లో ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఫ్లైట్ ఇంజనీర్‌గా ఆమె సేవలు అందించాల్సి ఉంటుంది. భారత వాయుసేనలో చేరడం ద్వారా తన చిరకాల స్వప్నం నెరవేరిందని పంజాబ్ వర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన హినా సంతృప్తి వ్య్తం చేశారు. తనకు చిన్ననాటి నుంచి సైనికుల యూనిఫాం ధరించి ఏవియేటర్‌గా ఆకాశంలో విహరించాలనే ఆసక్తి ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. ఫ్లైట్ ఇంజనీర్‌గా వాయుసేనలో ఆమె గత ఆరు నెలల నుంచి కఠోర శిక్షణ తీసుకున్నారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
చండీగడ్: క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలోకుక్కి చితకబాదింది. జుట్టు పట్టి, చెవులు పిండుతూ.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. అప్పటికే కాలు గాయంతో బాధపడుతున్న చిన్నారిపై కాస్త కనికరం కూడా చూపించలేదు. ఈ తతంగాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్ఫోన్లో చిత్రికరించడంతో విషయం బయటకు వెలుగు చూసింది. రెండు నెలల క్రితం ఆ చిన్నారి తల్లి క్యాన్సర్ మరణించడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతను ఆ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
-
అబార్షన్లపై భిన్న తీర్పులు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: సమీప బంధువు అత్యాచారం వల్ల గర్భవతి అయిన చండీఘడ్‌కు చెందిన ఓ పదేళ్ల బాలిక అబార్షన్‌కు గత జూలై నెలలో సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వలేదు. అప్పటికే ఆ బాలిక 32 వారాల గర్భవతి. అత్యాచారం కారణంగా గర్భవతై 32 వారాలవుతున్న ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలిక అబార్షన్‌కు ఇటీవల అదే సుప్రీం కోర్టు అనుమతించింది. సుప్రీం కోర్టు పరస్పర భిన్నంగా తీర్పు చెప్పిన ఇలాంటి కేసులు ఇవి రెండే కావు. ఇంకా ఉన్నాయి. శిశువు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని వైద్య నిపుణుల సూచన మేరకు సుప్రీం కోర్టు గత జూలై నెలలో పదేళ్ల బాలిక అబార్షన్‌కు అనుమతి నిరాకరించగా, అదే శిశువుకు ప్రాణహాన్ని ఉందని తెలిసి కూడా పలువురి అబార్షన్లను ఉన్నత ధర్మాసనం అనుమతి మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? మానసికంగా లేదా ఆరోగ్యపరంగా తల్లికి ముప్పున్న సందర్భాల్లో, పిండస్థ దుష్పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు 20 వారాల లోపు అబార్షన్‌కు చట్టం అనుమతిస్తోంది. ఆ 20 వారాలు దాటినప్పుడే అబార్షన్ కోసం కోర్టుల అనుమతి తప్పనిసరవుతోంది. ఇలాంటి సందర్భాల్లోనే తీర్పులు భిన్నంగా ఉంటున్నాయి. కారణం వైద్యుల సలహా తీసుకోవడం, వారి సలహాలు కూడా పరస్పరం భిన్నంగా ఉండడమే. చండీఘడ్ కేసులోనూ, ఇతర కేసుల్లో మెడికల్ బోర్డులు ఇచ్చిన సలహాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఈ కేసులో పదేళ్ల బాలికకు ఈ దశలో అబార్షన్ చేయడం వల్ల తల్లీ బిడ్డలకు ముప్పుందని, గర్భం కొనసాగించడం వల్ల తల్లీ బిడ్డలకు ఎలాంటి ముప్పులేదని మెడికల్ బోర్డు సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆ బాలిక అబార్షన్న్కు అనుమతించలేదు. పదేళ్ల వయస్సులో బిడ్డను కనడం, సమాజంలో పోషించడం మానసికంగా ఆ బాలికకు ఎంత కష్టం అవుతుందన్న అంశాన్ని ఈ కేసులో మెడికల్ బోర్డు పరిగణలోకి తీసుకోలేదు. ఓ దశ తర్వాత శిశువుకు కూడా జన్మించే హక్కు ఉంటుందని చండీఘడ్ మెడికల్ బోర్డులో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ వణితా సూరి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అందుకనే ఆమె బిడ్డ ప్రాణాలకు ముప్పుందన్న కారణంగా అబార్షన్‌ను వ్యతిరేకించారు. ఆ మెడికల్ రిపోర్ట్ తప్పంటూ కామన్ హెల్త్ చైర్పర్సన్ డాక్టర్ సుభా శ్రీ అభిప్రాయపడ్డారు. పదేళ్ల బాలిక కటి వలయం ఎముకలు కూడా గర్భాన్ని భరించేంత బలంగా ఉండవని, పిండం ఎదుగుతున్నాకొద్ది తల్లికి ప్రాణహాని ఉండదని కచ్చితమైన అభిప్రాయానికి రాలేమని కూడా ఆమె అన్నారు. అయితే సిజేరియన్ వల్ల చండీఘడ్ బాలిక ఆ తర్వాత రెండు రోజులకే తల్లయింది. ఆమె, శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. సుప్రీం కోర్టు అబార్షన్‌కు అనుమతించినప్పటికీ ముంబై బాలిక విషయంలో జేజే ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమెకు పురుడు పోశారు. పెళ్లి కాకుండా జన్మించిన ఆ మగ బిడ్డను ఏం చేసుకోవాలో ఆ తల్లికి, ఆమెను కన్న తల్లిదండ్రులకు తెలియడం లేదు. బ్రిటన్‌లో లాగా అబార్షన్‌కు సంబంధించిన సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లనే వైద్య నిపుణుల సలహాలతోపాటు కోర్టుల తీర్పులు పరస్పరం భిన్నంగా ఉంటున్నాయి. బ్రిటన్‌లో 24 వారాల వరకు అబార్షన్‌ను చట్టం అనుమతిస్తోంది. 20 వారాల లోపైతే ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఆ తర్వాత మరో నాలుగు వారాలపాటు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే విషయమై రాయల్ కాలేజీకి చెందిన ఆబ్స్టీట్రిసియన్, గైనకాలోజిస్టులు మార్గదర్శకాలను రూపొందించారు. మన దేశంలో కూడా అబార్షన్లకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2016లో విడుదల చేసింది. అయితే చట్టం అనుమతిస్తున్న 20 వారాల లోపు అబార్షకు సంబంధించి మాత్రమే ఆ మార్గదర్శకాలున్నాయి. వైద్యుల సలహా మేరకు గర్భాన్ని కొనసాగించినప్పుడు తల్లీ, బిడ్డలకు, ముఖ్యంగా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే అందుకు వైద్యులను బాధ్యులను చేసే నిబంధనలు ఏవీ లేవు. లండన్‌లో 21 వారాలు దాటిని అనంతరం అబార్షన్లు చేయాల్సి వస్తే ముందుగా గర్భంలోని శిశువును ఇంజెక్షన్ ద్వారా చంపేస్తారు. అనంతరం అబార్షన్ చేస్తారు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి. భారత్‌తోపాటు పలు వర్ధమాన దేశాల్లో సురక్షిత గర్భస్రావం హక్కు కోసం 1200 మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. -
బిడ్డకు జన్మనిచ్చిన పదేళ్ల బాలిక
చండీగఢ్: దగ్గరి బంధువు చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన ఓ పదేళ్ల బాలిక తనకు తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. కడుపులో రాళ్లు ఉన్నాయనీ, ఆపరేషన్ చేయాలని చెప్పి ఆమెను తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలిక గర్భస్రావానికి సుప్రీంకోర్టు గతనెల 28న అనుమతి నిరాకరిండంతో చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం గురువారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించి కాన్పు చేశారు. ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్ట్, పిడియాట్రిషియన్ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ దాసరి హరీశ్ తెలిపారు. ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్ సజావుగా సాగిందనీ, శిశువు బరువు (2.2 కేజీలు) కొంచెం తక్కువగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని వెల్లడించారు. బాలిక ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. వైద్య ఖర్చులను చండీగఢ్ పాలనయంత్రాంగం భరిస్తోందని చెప్పారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా బిడ్డను దత్తత ఇవ్వాలని ఆమె తండ్రి ఆసుపత్రి వర్గాలను కోరారు.