కడప స్పోర్ట్స్: దేశవాళీ మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్ సింగ్ గతంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. అయితే బోర్డు గుర్తింపు పొందిన ఒక వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
చండీగఢ్ కెప్టెన్ కూడా అయిన కశ్వీ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్‌ను ఒంటి చేత్తో పడగొట్టింది. 4.5 ఓవర్లు వేసిన ఆమె ఒక ఓవర్ మెయిడిన్ సహా 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తన రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. కశ్వీ బౌలింగ్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే కుప్పకూలింది. జట్టులో 8 మంది డకౌట్ కాగా... ముగ్గురు 10, 4, 3 చొప్పున పరుగులు చేశారు. మరో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అంతకుముందు 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసిన చండీగఢ్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కూడా కశ్వీ (68 బంతుల్లో 49; 6 ఫోర్లు)నే టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment