అబార్షన్లపై భిన్న తీర్పులు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: సమీప బంధువు అత్యాచారం వల్ల గర్భవతి అయిన చండీఘడ్‌కు చెందిన ఓ పదేళ్ల బాలిక అబార్షన్‌కు గత జూలై నెలలో సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వలేదు. అప్పటికే ఆ బాలిక 32 వారాల గర్భవతి. అత్యాచారం కారణంగా గర్భవతై 32 వారాలవుతున్న ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలిక అబార్షన్‌కు ఇటీవల అదే సుప్రీం కోర్టు అనుమతించింది. సుప్రీం కోర్టు పరస్పర భిన్నంగా తీర్పు చెప్పిన ఇలాంటి కేసులు ఇవి రెండే కావు. ఇంకా ఉన్నాయి.
శిశువు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని వైద్య నిపుణుల సూచన మేరకు సుప్రీం కోర్టు గత జూలై నెలలో పదేళ్ల బాలిక అబార్షన్‌కు అనుమతి నిరాకరించగా, అదే శిశువుకు ప్రాణహాన్ని ఉందని తెలిసి కూడా పలువురి అబార్షన్‌లను ఉన్నత ధర్మాసనం అనుమతి మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? మానసికంగా లేదా ఆరోగ్యపరంగా తల్లికి ముప్పున్న సందర్భాల్లో, పిండస్థ దుష్పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు 20 వారాల లోపు అబార్షన్‌కు చట్టం అనుమతిస్తోంది. ఆ 20 వారాలు దాటినప్పుడే అబార్షన్ కోసం కోర్టుల అనుమతి తప్పనిసరవుతోంది. ఇలాంటి సందర్భాల్లోనే తీర్పులు భిన్నంగా ఉంటున్నాయి. కారణం వైద్యుల సలహా తీసుకోవడం, వారి సలహాలు కూడా పరస్పరం భిన్నంగా ఉండడమే.
చండీఘడ్ కేసులోనూ, ఇతర కేసుల్లో మెడికల్ బోర్డులు ఇచ్చిన సలహాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఈ కేసులో పదేళ్ల బాలికకు ఈ దశలో అబార్షన్ చేయడం వల్ల తల్లీ బిడ్డలకు ముప్పుందని, గర్భం కొనసాగించడం వల్ల తల్లీ బిడ్డలకు ఎలాంటి ముప్పులేదని మెడికల్ బోర్డు సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆ బాలిక అబార్షన్‌న్‌కు అనుమతించలేదు.
పదేళ్ల వయస్సులో బిడ్డను కనడం, సమాజంలో పోషించడం మానసికంగా ఆ బాలికకు ఎంత కష్టం అవుతుందన్న అంశాన్ని ఈ కేసులో మెడికల్ బోర్డు పరిగణలోకి తీసుకోలేదు. ఓ దశ తర్వాత శిశువుకు కూడా జన్మించే హక్కు ఉంటుందని చండీఘడ్ మెడికల్ బోర్డులో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ వణితా సూరి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. అందుకనే ఆమె బిడ్డ ప్రాణాలకు ముప్పుందన్న కారణంగా అబార్షన్‌ను వ్యతిరేకించారు.
ఆ మెడికల్ రిపోర్ట్ తప్పంటూ కామన్ హెల్త్ చైర్‌పర్సన్ డాక్టర్ సుభా శ్రీ అభిప్రాయపడ్డారు. పదేళ్ల బాలిక కటి వలయం ఎముకలు కూడా గర్భాన్ని భరించేంత బలంగా ఉండవని, పిండం ఎదుగుతున్నాకొద్ది తల్లికి ప్రాణహాని ఉండదని కచ్చితమైన అభిప్రాయానికి రాలేమని కూడా ఆమె అన్నారు. అయితే సిజేరియన్ వల్ల చండీఘడ్ బాలిక ఆ తర్వాత రెండు రోజులకే తల్లయింది. ఆమె, శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. సుప్రీం కోర్టు అబార్షన్‌కు అనుమతించినప్పటికీ ముంబై బాలిక విషయంలో జేజే ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమెకు పురుడు పోశారు. పెళ్లి కాకుండా జన్మించిన ఆ మగ బిడ్డను ఏం చేసుకోవాలో ఆ తల్లికి, ఆమెను కన్న తల్లిదండ్రులకు తెలియడం లేదు.
బ్రిటన్‌లో లాగా అబార్షన్‌కు సంబంధించిన సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లనే వైద్య నిపుణుల సలహాలతోపాటు కోర్టుల తీర్పులు పరస్పరం భిన్నంగా ఉంటున్నాయి. బ్రిటన్‌లో 24 వారాల వరకు అబార్షన్‌ను చట్టం అనుమతిస్తోంది. 20 వారాల లోపైతే ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఆ తర్వాత మరో నాలుగు వారాలపాటు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే విషయమై రాయల్ కాలేజీకి చెందిన ఆబ్‌స్టీట్రిసియన్, గైనకాలోజిస్టులు మార్గదర్శకాలను రూపొందించారు. మన దేశంలో కూడా అబార్షన్లకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2016లో విడుదల చేసింది.
అయితే చట్టం అనుమతిస్తున్న 20 వారాల లోపు అబార్షకు సంబంధించి మాత్రమే ఆ మార్గదర్శకాలున్నాయి. వైద్యుల సలహా మేరకు గర్భాన్ని కొనసాగించినప్పుడు తల్లీ, బిడ్డలకు, ముఖ్యంగా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే అందుకు వైద్యులను బాధ్యులను చేసే నిబంధనలు ఏవీ లేవు. లండన్‌లో 21 వారాలు దాటిని అనంతరం అబార్షన్లు చేయాల్సి వస్తే ముందుగా గర్భంలోని శిశువును ఇంజెక్షన్ ద్వారా చంపేస్తారు. అనంతరం అబార్షన్ చేస్తారు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి. భారత్‌తోపాటు పలు వర్ధమాన దేశాల్లో సురక్షిత గర్భస్రావం హక్కు కోసం 1200 మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.