ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తే దారుణాలే!
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ
ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించొద్దు..
పొదుపుగా ప్రకృతి వనరుల వినియోగం
ఫోర్టాలెజా: ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘బ్రిక్స్’ దేశాలకు పిలుపునిచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం మోడీ ప్రసంగించారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. అది మానవత్వానికి వ్యతిరేకమేనని నా ప్రగాఢ విశ్వాసం. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు’ అని తేల్చి చెప్పారు. ‘అఫ్ఘానిస్థాన్ నుంచి ఆఫ్రికా వరకు ఉన్న ప్రాంతమంతా సంక్షోభంలో, సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఆయా దేశాలు ముక్కలైపోతుంటే మనం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతే.. భవిష్యత్ పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని బ్రిక్స్ దేశాధినేతలను హెచ్చరించారు. ‘ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన దేశాల భవిష్యత్తునే కాదు.. మొత్తం ప్రపంచ భవిష్యత్తునే నిర్దేశిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. సైబర్ స్పేస్‌ను సురక్షితంగా, అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బ్రిక్స్ దేశాలపై ఉందన్నారు. సరళీకృత, పారదర్శక అంతర్జాతీయ వాణిజ్య విధానాలను అవలంబించాల్సి ఉందని, అది ప్రపంచ ఆర్థికరంగ వృద్ధికి అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. ఆహార భద్రత వంటి విషయాల్లో అన్ని వర్గాల ఆకాంక్షలను తీర్చేలా ఆర్థిక వృద్ధి ఉపయోగపడాలన్నారు.
వసుధైక కుటుంబం..: ప్రపంచమంతా ఒకే కుటుంబమని నమ్మే ‘వసుధైక కుటుంబం’ భావన ఉద్భవించిన గడ్డ నుంచి తాను వచ్చానని మోడీ తెలిపారు. ప్రకృతిని నాశనం చేయడం నేరమని, అది ప్రసాదించే వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు. ‘మా ప్రగతికి ఆటంకం లేకుండా వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటాం’ అని భారత ప్రణాళికను చెప్పారు. మౌలికవసతులు, చవకైన గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్య, స్వచ్ఛమైన శక్తి..వంటి రంగాల్లో తమ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలనుకుంటోందని మోడీ వెల్లడించారు.
ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం..
బ్రిక్స్ సదస్సుకు ముందు బ్రెజిల్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన మోడీ.. ఎనభై నిమిషాలు పాటు చర్చలు జరిపారు. ఉద్రిక్తతలకు కారణమవుతున్న సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనాలని చైనాకు మోడీ నొక్కిచెప్పారు. ఈ సమస్యకు స్నేహపూర్వకంగా పరిష్కారం కనుగొన్నట్లయితే, ఇలాంటి వివాదాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. బోర్డర్ వద్ద ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరిగినా అది దౌత్య సంబంధాలపై ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేశారు.
చరిత్రను గుర్తు చేసుకుంటూ...
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల కేంద్రంగా జిన్‌పింగ్, మోడీ చర్చలు నడిచాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అభివృద్ధిపై మోడీ దృష్టిని జిన్‌పింగ్ ప్రస్తుతించగా.. అదే సమయంలో చైనాలో తన పర్యటనల గురించి మోడీ గుర్తుచేసుకున్నారని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించడానికి జిన్‌పింగ్ అంగీకారం తెలిపారని చెప్పారు. అదే సమయంలో ఈ ఏడాది తాము ఆతిథ్యమిచ్చే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం (అపెక్) సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత ప్రధానిని చైనా ఆహ్వానించింది. ఇలాంటి ఆహ్వానం రావడం భారత్‌కు ఇదే తొలిసారి. అంతర్జాతీయ వేదికలపై ఆసియా దిగ్గజాలు ఇద్దరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. 21 దేశాలు పాల్గొనే ఆ సదస్సు నవంబర్‌లో జరుగుతుందని, అయితే ప్రధానికి ఆ సమయంలో వీలు పడుతుందో లేదో చూడాలని అక్బరుద్దీన్ చెప్పారు. అదే సమయంలో జి-20, సార్క్ సదస్సులు ఉన్నాయని, అయినా చైనా ఆహ్వానాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నామని తెలిపారు.