
ఫ్లీట్ రివ్యూపై ఉగ్ర గురి?
♦ కారులో ఐదుగురు ఇరానియన్లు
♦ వేంపాడు టోల్‌గేట్ వద్ద పోలీసుల పట్టివేత
సాక్షి, విశాఖపట్నం/నక్కపల్లి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)పై ఉగ్రవాదులు గురిపెట్టారా?.. వారం రోజుల్లో విశాఖలో ఐఎఫ్‌ఆర్ జరగనున్న నేపథ్యంలో ఐదుగురు అనుమానితులు పోలీసులకు పట్టుబడడం.. తాము ఇరాన్ దేశస్తులమని చెప్పడం.. వారి వద్ద ఆ దేశపు పాస్‌పోర్టులుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తప్పించుకున్న వారే వీరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం కలకలం రేపిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి.
తెల్లని టయోటా కారు(డీఎల్ సీసీజే-1520)లో కొందరు వ్యక్తులు వస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి నక్కపల్లి ఎస్‌ఐ రామకృష్ణకు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సమాచారం అందింది. దీంతో ఆయన రాత్రి 7.30 గంటల సమయంలో విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆ కారును వేంపాడు టోల్‌గేట్ వద్ద తనిఖీ చేయగా.. అందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వివరాలు అడగ్గా తాము ఇరాన్ దేశస్తులమని, భారతదేశం చూడ్డానికి వచ్చామని, ప్రస్తుతం భువనేశ్వర్ నుంచి వస్తున్నామని చెప్పారు. అనుమానం వచ్చిన ఎస్‌ఐ వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని నక్కపల్లి పోలీస్‌స్టేషన్ తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీ రాఘేవేంద్ర, యలమంచిలి సీఐ వెంకట్రావులు వారిని హుటాహుటిన విశాఖపట్నం తీసుకొచ్చారు.
విదేశీయులు డ్రైవింగ్ చేసుకుని వస్తారా?
ఇరాన్‌కు చెందిన వారుగా చెబుతున్న వీరు పరాయి దేశంలో సొంతంగా కారు నడుపుతూ వెళ్లడం, అదీ ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో తిరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇరాన్ వారైతే ఈ రాష్ట్రంలో స్థానికుల్లా పర్యటించడం పట్ల పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనుమానితులు ప్రయాణిస్తున్న కారుకు ముందు భాగాన డీఎల్ 6సీజే-1520 నంబరు, వెనకన డీఎల్-సీసీజే-1520 నంబరు ఉంది. దీన్ని బట్టి వీరు కారును ఎత్తుకొచ్చి ప్రయాణిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
భువనేశ్వర్‌లో తప్పించుకున్న వారేనా?
పట్టుబడిన వారు మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పరారైన వారేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇరాక్‌కు చెందిన వారిగా హోటల్ వారికి చెప్పడంతో ఆరా తీసి గుర్తింపు కార్డులు అడగడం.. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో అక్కడ నుంచి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారులో పరారైన సంగతి తెలిసిందే. వీరిని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని ఒడిశా డీజీపీ కేబీ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. 24 గంటలు గడవక ముందే ఐదుగురు కారులో వెళ్తూ పట్టుబడడం, అది కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు కావడం, ఇరాన్‌కు చెందిన వారవడంతో వీరు వారేనన్న విషయం స్పష్టమవుతోంది.
అదుపులోకి తీసుకున్నాం..
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని వేంపాడు టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద ఇరాన్‌కు చెందిన పాస్‌పోర్టులున్నాయి. వారిని విచారిస్తున్నాం. పూర్తి వివరాలు గురువారం నాటికి చెబుతాం.
- కోయ ప్రవీణ్, ఎస్పీ, విశాఖపట్నం