పుణే: దేశంలో పెరుగుతున్న అశాంతి, అసహనానికి నిరసనగా తమ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న వారికి మరో ముగ్గురు జత కలిశారు. ఎఫ్టిఐఐ పూర్వ విద్యార్థులు ముగ్గురు... తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన విక్రాంత్ పవార్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాకేశ్ శుక్ల, గోవాకు చెందిన ప్రతీక్ సినీ రంగంలో తాము సాధించిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు.
గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న అవాంఛనీయ పరిణామాలకు నిరసనగా తమ అవార్డులను తిరిగి ఇస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 'పవార్ కతాల్' ఫిక్షన్ మూవీకి గాను, 2012 లో రాష్ట్రపతి బంగారు పతకాన్ని, శుక్ల 'డాంకీ ఫెయిర్' 2013 స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రతీక్ 'కాల్' ఉత్తమ షార్ట్ ఫిలిం రజత్ కమల్ అవార్డును గెల్చుకున్నారు.
కాగా పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గత 139 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని విరమించి క్లాసులకు హాజరవుతామని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వివిధ దశల్లో జరిగిన చర్చల ప్రతిష్టంభన అనంతరం క్లాసులకు హాజరైనా, తమ శాంతియుత నిరసన,ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు ప్రకటించారు. సంస్థ చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకంపై ఎఫ్టిఐఐ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.