జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన సీనియర్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన సీనియర్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమితుడైన అవనీత్ సింగ్ బేడిని ఆయన నివాసమైన దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్కులో గత రాత్రి అరెస్టు చేశారు. ఆర్మీ మాజీ కల్నల్ అయిన బేడీ ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన చికంబర్‌పూర్‌లో 945 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఘజియాబాద్ మున్సిపల్ కమిషనర్ అరుణ్‌కుమార్ గుప్తా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇందులో 532 చదరపు మీటర్లను ట్రాన్స్‌పోర్టు కంపెనీకి అద్దెకు ఇచ్చారని, ట్రాన్స్‌పోర్టు గోడౌన్లోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు నిర్మించారని ఎస్‌పీ ఆకాష్ తోమర్ చెప్పారు. సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు పరిపాలనా అధికారులు నిందితులపై చర్యలకు ఉపక్రమించారన్నారు. కాగా, సిబ్బంది, అధికారుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడేందుకు జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ప్రతినిధి నిరాకరించారు.