బాగా తాగేసే ఢీకొట్టాడు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో రిపబ్లిక్ డే పరేడ్ ను ప్రాక్టీస్ చేస్తుండగా కారులో వెళుతూ వేగంగా ఢీకొట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు సాంబియా సోహ్రాబ్ ఆ రోజు ఫుల్లుగా తాగి ఉన్నాడని పోలీసులు నిర్దారించారు. అతడి స్నేహితుడు చెప్పినా వినకుండా డ్రైవింగ్ చేసి భారత వైమానిక దళ అధికారి మీద నుంచి కారును నడిపాడని చెప్పారు.
కీలక పోలీసు వర్గాల కీలక సమాచారం మేరకు జనవరి 13న సాంబియా, జానీ, సోనూ అనే ముగ్గురు యువకులు బాగా తాగారు. వీరిలో సాంబియా అనే వ్యక్తి ఓ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు. ఇతడే కారును వేగంగా డ్రైవ్ చేస్తూ ఆ రోజు పరేడ్ ప్రాక్టీస్ చేస్తున్న వైమానిక దళంలోని ఓ సైనికుడి మీద నుంచి పోనిచ్చినట్లు చెప్పారు. దాంతో అప్పటి నుంచి అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా దొరకకుండా తప్పించుకు తిరుగుతూ శనివారం రాత్రి పట్టుబడినట్లు చెప్పారు. అతడిని కోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పారు.