
తిరువనంతపురం: కేరళలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళా హక్కుల నేత తృప్తి దేశాయ్‌తోపాటు మొత్తం ఆరుగురు మహిళలు శబరిమల కేరళ వచ్చారు. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భద్రత కల్పించాలంటూ కొచ్చి సిటీ పోలీసు కమిషనర్‌ను వారు ఆశ్రయించారు. అయితే, వారి బృందంలో ఒకరైన బిందు అమ్మినిపై సీపీ కార్యాలయం ఎదుటే దాడి జరిగింది. హిందూ సంస్థల కార్యకర్త ఒకరు కారంపొడి స్ప్రేతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గత జనవరిలో హిందూ సంస్థల కళ్లుగప్పి బిందు అమ్మిని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తాజాగా కూడా తృప్తి దేశాయ్‌తో కలిసి మరోసారి అయ్యప్పను దర్శించుకోవడానికి ఆమె వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో బిందుతోపాటు తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టు సమీక్షకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం శబరిమలకు వచ్చే మహిళలకు భద్రత కల్పించలేమంటూ కేరళ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాకే తాము కేరళను వీడి వెళతామని తృప్తి దేశాయ్ చెప్తున్నారు. దేశంలో అందరికీ సమాన హక్కులుంటాయని రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇవాళ.. మమ్మల్ని ఇలా అడ్డుకోవడం, దాడులు చేయడం తమను ఆవేదనకు గురిచేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment