ఆరుగురికి జీవితాన్ని ఇచ్చిన 'యధార్థ్'
బెంగళూరు: బెంగళూరుకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి ఈ లోకాన్ని వీడిపోతూ ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. యధార్థ్ ఉపాధ్యాయ అనే బాలుడు మరణాంతరం అతని శరీరంలోని గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాలను ప్రాణపాయంతో ఉన్న ఆరుగురికి దానం చేశారు. బెంగళూరు పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి యధార్థ్ శరీర భాగాలను చెన్నైకు తరలించేందుకు సాయపడ్డారు.
అవయవాలను దానం చేయడం ద్వారా మరణించిన తర్వాత కూడా మరో రూపంలో జీవించేలా చేస్తుందని చిన్నారి తండ్రి అమిత్ ఉపాధ్యాయ అన్నారు. మరణమన్నది ముగింపు కాదన్న సందేశాన్ని సమాజానికి ఇవ్వాలని కోరుకున్నానని, మనం చనిపోయినా ఈ విధంగా సమాజానికి సేవ చేయవచ్చని చెప్పారు.
'ఆస్పత్రిలో పక్క బెడ్పై 12 ఏళ్ల బాలుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. వాళ్లు చాలా పేదవారు. ఆ చిన్నారిని చూసిన తర్వాత యధార్థ్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించాను. నాలాంటి బాధ ఇతర కుటుంబాలకు రాకూడదు. యధార్థ్ చాలా చిన్న వయసులో చనిపోయాడు. అవయవాలను దానం చేయడం ద్వారా మా అబ్బాయి మరణించినా భూమిపై ప్రకాశవంతంగా ఉంటాడు' అని అమిత్ ఉపధ్యాయ చెమర్చిన కళ్లతో చెప్పారు.