తిరువనంతపురం : శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారు జామున3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు హహిళలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.(అన్ని వయసుల వారికి అనుమతి)
పోలీసుల సంరక్షణలో బిందు, కనకదుర్గ
నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ బయటకు వచ్చి కేరింతలు కొడుతూ అయప్ప స్వామిని దర్శించుకున్నామని ఆనందంగా చెప్పారు. వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళలుగా(50ఏళ్లలోపు) వీరు చరిత్రకెక్కారు.
ఆలయ మూసివేత
ఇద్దరు మహిళా భక్తులు శబరిమల ఆలయంలోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని ఆలయాన్ని మూసివేశారు. శుద్ది చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని ప్రధాన పూజారి చెప్పారు. భక్తుల కళ్లు కప్పి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు. పోలీసుల సహకారంతో అయప్ప స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. మహిళల ప్రవేశాన్ని అయప్ప భక్తులు, సాంప్రదాయవాదులు తప్పుబట్టారు. అలయంలో అపచారం జరిగిందని గుడిని మూసివేశారు. సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని చెబుతున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.40గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. 12.40గంటల తర్వాత ప్రత్యేక పూజలు చేసి, ఒంటి గంటకు భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. మరో వైపు మహిళల ప్రవేశం నిజమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేయడంతో సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. ఇటీవల కొంత మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. అయితే ఈ సారి ఎలాంటి ఘర్షనలు లేకుండా నిశ్శబ్దంగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.(శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు)
Comments
Please login to add a commentAdd a comment