న్యూఢిల్లీ: శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, కనీస ఆరోగ్య సౌకర్యాలు లోపించిన కారణంగా దేశంలో సగటున ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు శిశువులు మరణిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్–ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్(యునిగ్మె) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ద్వారా ఈ చేదు నిజం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు అత్యధిక సంఖ్యలో సంభవిస్తున్నది భారత్‌లోనేనని నివేదిక స్పష్టం చేసింది. అయితే గత ఐదేళ్ల సంఖ్యలను పోలిస్తే దేశంలో శిశు మరణాలు అత్యంత తక్కువగా నమోదైన సంవత్సరం 2017 కావడం కాస్తంత ఊరటనిచ్చే అంశం. గతేడాది దేశవ్యాప్తంగా 8,02,000 మంది శిశువులు మరణించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థలో హెల్త్ చీఫ్‌గా ఉన్న వైద్యుడు గగన్ గుప్తా యునిగ్మె నివేదికపై స్పందిస్తూ శిశు మరణాలకు కారణమవుతున్న వ్యాధులు, పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు. ‘దేశంలో ఏడాదికి రెండున్నర కోట్ల మంది పుడుతున్నారు. శిశుమరణాలు గత ఐదేళ్ల కనిష్టానికి చేరాయి. ఒక ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో భారత్ నుంచి ఎంత మంది ఉంటున్నారో.. అంతేమంది భారత్‌లో జన్మిస్తున్నారు. ఈ రెండు సంఖ్యలు సమానం కావడం ఇదే ప్రథమం. ఇకపై శిశుమరణాలను తగ్గించే దిశగా తదుపరి చర్యలు ఉంటాయి’ అని గగన్ గుప్తా వివరించారు.
ఐరాస బాలల నిధి భారత విభాగ ప్రతినిధి యాస్మీన్ అలీ హాక్ మాట్లాడుతూ ‘శిశు మరణాలను తగ్గించడంలో భారత పురోగతి కొనసాగుతోంది. వైద్యుల పర్యవేక్షణలోనే ప్రసవాలు అయ్యేలా చేసేందుకు, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు కృషి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శిశువుల ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నింటి కారణంగానే భారత్‌లో శిశు మరణాలు తగ్గుతున్నాయి’ అని చెప్పారు. క్రై (చైల్డ్ రైట్స్ అండ్ యు) సంస్థ డైరెక్టర్ ప్రీతి మహార మాట్లాడుతూ దేశంలో ఆకలిని రూపుమాపి, అందరికీ పోషకాహారం అందేలా చూసినప్పుడే చిన్నారుల మరణాలు తగ్గుతాయని సూచించారు.
నివేదికలోని ముఖ్యాంశాలు..
♦ ప్రపంచవ్యాప్తంగా పుడుతున్న పిల్లల్లో 18 శాతం మంది భారత్‌లోనే జన్మిస్తున్నారు.
♦ ప్రపంచవ్యాప్తంగా చూస్తే శిశు మరణాలు భారత్‌లోనే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (4.66 లక్షలు), పాకిస్తాన్ (3.3 లక్షలు), కాంగో (2.33 లక్షలు) ఉన్నాయి.
♦ భారత్‌లో 2017లో 6.05 లక్షల మంది నవజాత శిశువులు మరణించారు. 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 1.52 లక్షల మంది చిన్నారులు చనిపోయారు.
♦ 2016లో దేశంలో మృత్యువాతపడిన శిశువులు 8.67 లక్షల మంది కాగా, 2017లో ఆ సంఖ్య 8.02 లక్షలకు తగ్గింది.
♦ 2016లో భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 44 మంది మరణించగా, 2017లో ఆ సంఖ్య దాదాపు 40కి తగ్గింది.
♦ ఐదేళ్లలోపు చిన్నారుల వరకు చూస్తే 2017లో మొత్తంగా 9.89 లక్షల మంది మరణించారు. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు సంబంధించి పది లక్షల కంటే తక్కువ సంఖ్యలో చిన్నారులు మరణించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి.
♦ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2017లో 15 ఏళ్లలోపు పిల్లల్లో 63 లక్షల మంది మరణించా రు. అంటే ప్రతి ఐదు సెకన్లకు ఒకరు చనిపోయారు. వీరిలో 54 లక్షల మంది ఐదేళ్లలోపే చనిపోయారు. వారిలోనూ సగం మంది నవజాత శిశువులుగానే కన్నుమూశారు. ఈ మరణాలకు నివారించదగిన వ్యాధులే కారణం.
Comments
Please login to add a commentAdd a comment