Child mortality
-
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్‌లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
బిడ్డ జాగ్రత్త!.. గడిచిన 6 నెలల్లో 5,167 చిన్నారులు మృతి
తల్లిదండ్రులకు ప్రాణమైన పసిపిల్లల జీవితం గాలిలో దీపమైంది. గర్భిణికి సరైన పోషకాహారం అందక బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, దాని వల్ల పలు రకాల జబ్బులు సోకడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవ సేవల లోపం ఇలా ఎన్నో కారణాలు పసిగుడ్లకు శాపంగా మారాయి. తమ బిడ్డ పూర్తి జీవితం ఆస్వాదించాలన్న కన్నవారి ఆశ ఊయలలోనే కొడిగడుతోంది. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు శిశువులు, బాలల మరణాల సంఖ్య ఏటా 10 వేల వరకూ ఉంటోంది. సాక్షి, బెంగళూరు: కోవిడ్ మహమ్మారి అనంతరం రాష్ట్రంలో పిల్లల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో 5 వేలమందికి పైగా బాలలు మృత్యువాత పడ్డారు. ఆరోగ్యశాఖ సమాచార వ్యవస్థలో ఉన్న అంశాలు ఈ విపత్తుకు అద్దం పడుతున్నాయి. గత ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబరు 30 వరకు ఐదేళ్ల లోపు వయసు కలిగిన 5,167 పిల్లలు పలు కారణాలతో కన్నుమూశారు. ఇందులో 3,648 మంది ఒక నెలలోపు పసికూనలు. ఆవేదన కలిగించే మరణాలు ►ఐదేళ్లలోపు బాలలు ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం 2020–21లో 9,120 మంది, 2021–22 లో 9,050 మంది మరణించారు. ►2019–20లో 11,504 మంది, 2018–19లో 11,781 మంది ఊపిరి వదిలారు. ► 2017–18లో 13,635 మంది కన్నుమూశారు. చదవండి: షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది ఇవి కొన్ని కారణాలే ►కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లల మరణాలు తగ్గినప్పటికీ ఆ తరువాత పెరిగాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి పడిపోవడం, అపౌష్టికత పెరగడం కారణం కావచ్చు. ►కోవిడ్ విస్తరించాక ఆస్పత్రుల్లో గర్భిణులకు, బాలింతలకు వైద్యసేవలు అందడం ఆలస్యమైంది. ►ఘోషా ఆస్పత్రులను కూడా కరోనా వైద్యాలయాలుగా మార్చడం, వైద్యసిబ్బంది కరోనా చికిత్సల్లో నిమగ్నం కావడం తెలిసిందే. ►అంగన్వాడీ కేంద్రాలు మూతపడి గుడ్లు, పౌష్టిక ఆహారం అందకపోవడంతో పేదవర్గాల తల్లీపిల్లల్లో రక్తహీనత, అపౌష్టికత, అతిసారం వంటివి ప్రబలాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. చదవండి: ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం ప్రతి 1000 మందిలో 21 మంది... ► 2020 సర్వే ప్రకారం కర్ణాటకలో ప్రతి వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లల్లో 21 మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ సంఖ్య కేరళలో 8 మంది, తమిళనాడులో 13 మందిగా ఉంది. ►శిశు మరణాల్లో దక్షిణ భారత రాష్ట్రాల సగటు.... జాతీయ సరాసరి అయిన 32 కంటే తక్కువగానే ఉంది. ►రాష్ట్రంలో ప్రతి 1000 మంది ఏడాది వయసులోపు శిశువుల్లో 19 మంది మరణిస్తే అది జాతీయ సగటు 28గా ఉంటోంది. నవజాత శిశు మృతులు 14 ఉంటే జాతీయ సరాసరి 20గా ఉంది. వైద్యారోగ్య శాఖ నివారణ చర్యలు ఈ నేపథ్యంలో పిల్లల మరణాల అడ్డుకట్టకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు రూపొందించింది. పిల్లలు మృతికి కారణం ఏమిటి? అనే సమాచారం సేకరించి నివారణ చర్యలకు నడుం బిగించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 41 నవజాత శిశువుల ప్రత్యేక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలను, సేవలను ముమ్మరం చేసింది. పిల్లలు మృతుల నియంత్రణకు ప్రసూతి అనంతరం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బసవ రాజదబాడి తెలిపారు. -
దంపతుల కలహాలకు చిన్నారులు బలి
శామీర్‌పేట్: భార్యాభర్తల కలహానికి అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. భర్తతో గొడవపడిన భార్య తను పురుగుల మందు తాగి, చిన్నారులిద్దరికీ తాగించింది. ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాలు విడిచారు. శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ ప్రజయ్ హోమ్స్ లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు శామీర్‌పేట పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గోపీనాథ్, ప్రీతి దంపతులు తమ కుమారులైన గౌరవ్ (4), కౌషిక్ (2)తో కలిసి మజీద్‌పూర్ ప్రజయ్‌హోమ్స్ లో ఉంటున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి) గోపీనాథ్ దంపతులు తరచూ గొడవపడుతుండేవారు. బుధవారం కూడా గొడవపడటంతో మనస్తాపానికి గురైన ప్రీతి.. ఉదయం భర్త గోపీ నాథ్ తను పనిచేసే ఫార్మా కంపెనీకి వెళ్లగానే, ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి, తనూ తాగింది. గోపీనాథ్ ఇంటికి వచ్చేసరికి ప్రీతి, ఇద్దరు చిన్నారులు ఇంట్లో పడి ఉన్నారు. వెంటనే వారి ని మేడ్చల్‌లోని లీలా హాస్పిటల్‌కు తరలించాడు. ఇద్దరు చిన్నారులు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి చిన్నారుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆదర్శ వివాహం.. రోజూ గొడవలే కర్నూలు జిల్లాకు చెందిన గోపీనాథ్.. ఆరేళ్ల క్రితం వరంగల్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ప్రీతి అనే అమ్మాయిని చూసి అనాథాశ్రమ నిర్వాహకులను ఒప్పించి, ఆమెను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అనాథ యువతిని పెళ్లాడిన ఆదర్శవంతుడిగా గుర్తింపు పొందాడు. ప్రజయ్‌హోమ్స్‌లో కాపురం పెట్టిన ఈ దంపతుల కాపురంలో పిల్లలు పుట్టిన అనంతరం గొడవలు ముదిరాయి. దీంతో విసుగెత్తిన ప్రీతి.. తాను పెరిగిన అనాథాశ్రమానికి వెళ్లి తన బాధ చెప్పుకునేదని తెలిసింది. మనస్పర్థలు పెరిగిన క్రమం లోనే మనస్తాపం చెందిన ప్రీతి పురుగుల మందు తాగి, తన ఇద్దరు పిల్లలకు తాగించిందని పోలీసులు చెప్పారు. -
ప్రతి 2 నిమిషాలకు 3 మరణాలు
న్యూఢిల్లీ: శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, కనీస ఆరోగ్య సౌకర్యాలు లోపించిన కారణంగా దేశంలో సగటున ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు శిశువులు మరణిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్–ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్(యునిగ్మె) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ద్వారా ఈ చేదు నిజం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు అత్యధిక సంఖ్యలో సంభవిస్తున్నది భారత్‌లోనేనని నివేదిక స్పష్టం చేసింది. అయితే గత ఐదేళ్ల సంఖ్యలను పోలిస్తే దేశంలో శిశు మరణాలు అత్యంత తక్కువగా నమోదైన సంవత్సరం 2017 కావడం కాస్తంత ఊరటనిచ్చే అంశం. గతేడాది దేశవ్యాప్తంగా 8,02,000 మంది శిశువులు మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో హెల్త్ చీఫ్‌గా ఉన్న వైద్యుడు గగన్ గుప్తా యునిగ్మె నివేదికపై స్పందిస్తూ శిశు మరణాలకు కారణమవుతున్న వ్యాధులు, పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు. ‘దేశంలో ఏడాదికి రెండున్నర కోట్ల మంది పుడుతున్నారు. శిశుమరణాలు గత ఐదేళ్ల కనిష్టానికి చేరాయి. ఒక ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో భారత్ నుంచి ఎంత మంది ఉంటున్నారో.. అంతేమంది భారత్‌లో జన్మిస్తున్నారు. ఈ రెండు సంఖ్యలు సమానం కావడం ఇదే ప్రథమం. ఇకపై శిశుమరణాలను తగ్గించే దిశగా తదుపరి చర్యలు ఉంటాయి’ అని గగన్ గుప్తా వివరించారు. ఐరాస బాలల నిధి భారత విభాగ ప్రతినిధి యాస్మీన్ అలీ హాక్ మాట్లాడుతూ ‘శిశు మరణాలను తగ్గించడంలో భారత పురోగతి కొనసాగుతోంది. వైద్యుల పర్యవేక్షణలోనే ప్రసవాలు అయ్యేలా చేసేందుకు, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు కృషి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శిశువుల ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నింటి కారణంగానే భారత్‌లో శిశు మరణాలు తగ్గుతున్నాయి’ అని చెప్పారు. క్రై (చైల్డ్ రైట్స్ అండ్ యు) సంస్థ డైరెక్టర్ ప్రీతి మహార మాట్లాడుతూ దేశంలో ఆకలిని రూపుమాపి, అందరికీ పోషకాహారం అందేలా చూసినప్పుడే చిన్నారుల మరణాలు తగ్గుతాయని సూచించారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. ♦ ప్రపంచవ్యాప్తంగా పుడుతున్న పిల్లల్లో 18 శాతం మంది భారత్‌లోనే జన్మిస్తున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా చూస్తే శిశు మరణాలు భారత్‌లోనే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (4.66 లక్షలు), పాకిస్తాన్ (3.3 లక్షలు), కాంగో (2.33 లక్షలు) ఉన్నాయి. ♦ భారత్‌లో 2017లో 6.05 లక్షల మంది నవజాత శిశువులు మరణించారు. 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 1.52 లక్షల మంది చిన్నారులు చనిపోయారు. ♦ 2016లో దేశంలో మృత్యువాతపడిన శిశువులు 8.67 లక్షల మంది కాగా, 2017లో ఆ సంఖ్య 8.02 లక్షలకు తగ్గింది. ♦ 2016లో భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 44 మంది మరణించగా, 2017లో ఆ సంఖ్య దాదాపు 40కి తగ్గింది. ♦ ఐదేళ్లలోపు చిన్నారుల వరకు చూస్తే 2017లో మొత్తంగా 9.89 లక్షల మంది మరణించారు. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు సంబంధించి పది లక్షల కంటే తక్కువ సంఖ్యలో చిన్నారులు మరణించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ♦ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2017లో 15 ఏళ్లలోపు పిల్లల్లో 63 లక్షల మంది మరణించా రు. అంటే ప్రతి ఐదు సెకన్లకు ఒకరు చనిపోయారు. వీరిలో 54 లక్షల మంది ఐదేళ్లలోపే చనిపోయారు. వారిలోనూ సగం మంది నవజాత శిశువులుగానే కన్నుమూశారు. ఈ మరణాలకు నివారించదగిన వ్యాధులే కారణం. -
తగ్గుతున్న శిశుమరణాలు
ఆడపిల్లలను గుండెలమీద కుంపటిగా భావించే రోజులకు ఇక తావులేదు. ఆడపిల్ల పుట్టుకనే శాసించే భ్రూణ హత్యలూ, బాలికల శిశు మరణాలు ఇక ఎంతోకాలం సాగవు అనడానికి ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా గణాంకాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతంతో పోలిస్తే పుట్టగానే మరణిస్తున్న ఆడపిల్లల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో తగ్గిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శిశుమరణాల విషయంలో సైతం మన దేశంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గత యేడాది 2017లో మన దేశంలో 8.02,000 శిశు మరణాలు సంభవించాయి. గత ఐదేళ్ళతో పోల్చుకుంటే ఇదే అతి తక్కువ అని యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్(యుఎన్ఐజిఎంఇ)గుర్తించింది. 2017లో 6,05,000 మంది శిశువులు పుట్టిన వెంటనే మరణిస్తే 5నుంచి 14 ఏళ్ళలోపు వారు 1.52.000 మంది మరణించారు. చిన్నవయస్సులోనే మరణిస్తున్న శిశువుల సంఖ్య 2016లో 8.67 లక్షలు ఉంటే, 2017కి 8.02 లక్షలకి తగ్గింది. 2016లో ప్రతి 1000 మంది పిల్లల్లో పుట్టిన వెంటనే 44 మంది మరణించారు. 2017లో పుట్టిన ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 39 మంది ఐదేళ్ళలోపే మరణించారు. ఆడపిల్లలైతే పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 40 మంది చిన్నారులు ఐదేళ్ళలోపు మరణించారు. గత ఐదేళ్ళతో పోలిస్తే పుట్టిన వెంటనే మరణిస్తోన్న బాలబాలికల్లో లింగభేదం నాలుగు రెట్లు తగ్గింది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం, ప్రపంచబ్యాంకు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికను బట్టి ప్రపంచవ్యాప్తంగా 2017లో 63 లక్షల మంది 15 యేళ్ళలోపే మృత్యువాత పడ్డారు. దీన్ని బట్టి ప్రతి ఐదు సెకండ్లకూ నివారించదగిన కారణాలతో ఒక చిన్నారి మరణిస్తూనే ఉన్నపరిస్థితి. ఇందులో అత్యధికంగా 54 లక్షల మంది చిన్నారులు పుట్టిన తొలి ఐదేళ్ళలోపున మరణించారు. 2017లో అంతర్జాతీయంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సహారాఎడారి దిగువన ఉన్న ఆఫ్రికాలోనే 50 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో మరణిస్తున్న చిన్నారుల్లో 30 శాతం మంది దక్షిణాసియాకి చెందినవారే. యూరప్ కంటే సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశంలో 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 15 రెట్లు ఎక్కువ. శిశువుకి అత్యంత కీలక దశ అయిన పుట్టిన నెలలోపే ప్రపంచవ్యాప్తంగా 2017లో 25 లక్షల మంది శిశువులు మరణించారు. పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలు 50 శాతం అధికం. 1990లో 1.2.6 కోట్ల మంది ఐదేళ్ళ లోపు చిన్నారుల మరణిస్తే, 2017లో 54 లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు మరణించారు. ఐదు నుంచి 14 ఏళ్ళలోపు చిన్నారుల మరణాలు సైతం 17 లక్షల నుంచి పది లక్షల లోపుకి తగ్గడం పురోభివృద్ధిగా భావిస్తున్నారు. సాధారణ ఔషధాలూ, టీకాలూ, సురక్షిత నీరు, విద్యుత్ లాంటి చిన్న చిన్న సహకారం అందకనే చాలా మంది మరణిస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం, దీనితో పాటు దేశ వ్యాప్తంగా పుట్టినవెంటనే పిల్లల సంరక్షణకోసం ప్రత్యేక యూనిట్లు ప్రారంభించడం చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించినట్టు యూనిసెఫ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ క్యాంపెయిన్‌లో భాగంగా అందిస్తోన్న పౌష్టికాహారం, 2019కల్లా బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నివారించే లక్ష్యంతో జరుగుతోన్న ప్రయత్నం కూడా చిన్నారులను మృత్యువుదరికి చేరకుండా ఆపుతోందని భావిస్తున్నారు. -
ఆ కడుపుకోతకు కారణమెవరు?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మెరుగైన వైద్యం అందుతుందని విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వస్తే బాలింత ప్రాణాలే పోయాయి. వచ్చేటప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నా ఆపరేషన్ చేసే సమయంలో పొరపాటు జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండవల్లి మండలం గున్ననపూడికి చెందిన వంగా చిట్టెమ్మ శస్త్రచికిత్సను సీనియర్ రెసిడెంట్ చేయడం వల్లే పొరపాటు జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంట్రా వాస్కులర్ ప్రాబ్లమ్‌తో పాటు యూరిన్ బ్లాడర్ కూడా దెబ్బతినడంతో అనుభవం లేని వైద్యురాలు చేయడం వల్లే అలా జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనాకు వస్తున్నారు. ఎస్‌ఆర్‌లకు బాధ్యత ఉంటుందా? ఒక ఏడాది కంపల్సరీ సర్వీస్ చేసేందుకు వచ్చిన సీనియర్ రెసిడెంట్లు ఎంతవరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శాశ్వత వైðద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పట్లేదు. దీంతో చిట్టెమ్మ లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రసూతి విభాగంలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. వారిపై ఆధారపడితే ఆస్పత్రి పరువు పోతుందంటున్నారు. సూపరింటెండెంట్ సార్.. ఇప్పుడేమంటారు? ఏడాది విధులు నిర్వహించి వెళ్లే వారిపై ఎలా ఆధారపడతామని, శాశ్వత వైద్యులు కావాలంటూ ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.రాజ్యలక్ష్మి కలెక్టర్‌ను కోరారు. తమ విభాగంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని, అర్హత ఉన్న వైద్యులను నియమించాలన్నారు. ఈ సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ చక్రధర్ జోక్యం చేసుకుని ఎస్‌ఆర్‌లతో చేయించుకోవాలంటూ వితండవాదం చేశారు. కలెక్టర్ సాక్షిగా ఈ వాదన జరగ్గా, ఇప్పుడు ఎస్ఆర్ చేసిన సర్జరీ వికటించి బాలింత మృతిచెందగా, సూపరింటెండెంట్ ఏం సమాధానం చెబుతారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుపేదల జీవితాలతో ఆడుకోకుండా వైద్యులను నియమించాల్సిన అవసరం ఉంది. వీఆర్ఎస్పై వెళ్లిన గత హెచ్‌వోడీ తమ విభాగంలో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని, సౌకర్యాలతో పాటు వైద్యుల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర అధికారులు మంత్రులతో జరిగిన సమావేశంలో గత హెచ్‌వోడీ ప్రాధేయపడ్డారు. ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు. పైగా ఏదైన ఘటన జరిగితే వైద్యులనే నిందించడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ చేయలేమని భావించిందో ఏమో వీఆర్‌పై వెళ్లిపోయింది. ఆమె వెళ్లి రెండేళ్లు గడస్తున్నా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పుడున్న వైద్యులు సైతం అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. అన్నీ చేశామంటారు.. ఇక్కడేం లేవు ప్రభుత్వాస్పత్రులకు అన్నీ చేశాం.. నాలుగేళ్లలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లామని వైద్యమంత్రి తరచూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. పడకలు 90 నుంచి 240కు పెంచారు. పెరిగిన పడకలకు వైద్యులు, సిబ్బంది ఎక్కడ నుంచి వస్తారనే ఆలోచన చేయలేదు. నాలుగేళ్ల కిందటే ప్రస్తుతం ప్రసూతి విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, ఆరు యూనిట్లు చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానిపై ఇప్పటికీ స్పందన లేదు. మరి నిరుపేదలకు మెరుగైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కరే అసిస్టెంట్.. పది సిజేరియన్లు రోజూ సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో ఉంటారు. ఆ సమయంలో పది సిజేరియన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో పది నుంచి పదిహేను సాధారణ డెలివరీలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరికి చేయాలంటే ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పదు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటే అలాంటి పరిస్థితి తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిపుణులైన వైద్యులు మరింత మందిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కన్నీటి లాలి
కనురెప్పలు కూడా పూర్తిగా విప్పుకోలేదు. పేగుబంధం తడి ఆరనేలేదు. పాలు తాగాలన్న పాల పెదవుల ఆర్తి తీరనే లేదు. ఈ పసికందు తల్లిప్రేమకు దూరమైంది. పుట్టగానే కన్నప్రేమ కరువైనా.. అమ్మ పొత్తిళ్లే అనుకుని ఈ పాప తువ్వాలులో హాయిగా నిద్రపోతుంటే.. కన్నబిడ్డను కంటినిండా చూసుకోలేని ఆ అ‘మృత’మూర్తి మౌనంగానే జోలపడింది. మమతానురాగాలకు దూరమైన ఈ తల్లీకూతుళ్లకే మాట లొస్తే.. తమ దుస్థితికి కారణమైన వైద్యుల వైఫల్యాన్ని నిందిస్తారో, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తారో.. లేక.. ఇలాంటి ఎడబాటు మరే తల్లీబిడ్డకు కలిగించొద్దని దేవుడ్ని ప్రార్థిస్తారో.. (విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి ఘటన వద్ద కనిపించిన హృదయవిదారక చిత్రమిది..) లబ్బీపేట(విజయవాడ తూర్పు): సిజేరియన్ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం బాలింత మృతికి కారణమయ్యిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆదివారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తల్లిలేని ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. రెండు గంటల పాటు ఆందోళన అనంతరం గుడివాడ ఆర్డీఓ చక్రపాణి ఆస్పత్రి వద్దకు చేరుకుని బంధువులతో చర్చలు జరిపి లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మండవల్లి మండలం గున్ననపూడి గ్రామానికి చెందిన వంగా చిట్టెమ్మ రెండో కాన్పు కోసం కలిదిండి మండలం చింతలమూరులోను పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 18న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లి చాలంటి బేబీ సరోజిని ప్రసవం కోసం కైకలూరులోని కమ్యూనిటీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడి వైద్యులూ చిట్టెమ్మకు ప్రసవం చేసేందుకు చేతులెత్తేసి.. విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో మరలా అక్కడి నుంచి ఈ నెల 19న విజయవాడ పాత ఆస్పత్రిలో ప్రసూతి విభాగానికి వచ్చారు. ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చిట్టెమ్మను విజయవాడ తరలించే సమయానికే పరిస్థితి విషమంగా మారడంతో గంటలోపే అత్యవసరంగా సిజేరియన్ నిర్వహించారు. దీంతో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. ఆపరేషన్ చేసిన పది గంటల తర్వాత కడుపునొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులు స్కానింగ్ చేశారు. పొట్టలో ఇంట్రావాస్కులర్ సిస్టమ్(పొట్ట లోపల బ్లీడింగ్) దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో మరోసారి అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి గర్భసంచిని సైతం తొలగించారు. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా యూరిన్ బ్లాడర్ దెబ్బతింది. దీంతో ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు లేక పోవడంతో గుంటూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం వేకువజామున మృతి చెందింది. విజయవాడ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ బంధువులు అక్కడికి చేరుకున్నారు. చిట్టెమ్మకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న గుడివాడ ఆర్డీవో అక్కడికి చేరుకొని బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
ఏ తల్లి పాడేను...
♦ సకాలంలో వైద్యం అందక బాలింత మృతి ♦ హైరిస్క్‌గా గుర్తించినా పర్యవేక్షణ కరువు ♦ ఆక్సిజన్ అందక మరో తల్లి కన్నుమూత ♦ తల్లులను కోల్పోయిన ఇద్దరు పసిబిడ్డలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎంతగా హెచ్చరికలు చేస్తున్నా... ఇంకా తల్లీబిడ్డల మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. సకాలంలో వైద్యం అందక... సరైన శ్రద్ధ తీసుకోక... ప్రసవసమయాన్ని సరిగా గుర్తించలేక... ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైరిస్క్‌గా గుర్తించిన ఓ గర్భిణిపై పర్యవేక్షణ కొరవడి ఓ తల్లి మృత్యువు పాలైతే... ఆక్సిజన్ అందక మరో తల్లి కన్నుమూసింది. ఈ రెండు ఘట నల్లో ఇద్దరు పసిబిడ్డలు తల్లుల ను కోల్పోయి ఒంటరిగా మిగిలారు. విజయనగరం జిల్లా : సకాలంలో వైద్యం అందక ఓ గిరిజన గర్భిణి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలం గుమ్మిడిగూడ పంచాయతీ దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ(22)కు ఆగస్టు నెల 22వ తేదీన కాన్పు సమయంగా సంబంధిత వైద్య సిబ్బంది తెలిపారు. కాని ఆదివారం రాత్రే తీవ్ర ప్రసవ నొప్పులు రావడంతో గ్రామస్తులు 12 గంటల సమయంలో 108కు సమాచారం అందించారు. ఆ వాహనం సోమవారం వేకువజాము 4 గంటలకు గ్రామానికి చేరుకోగా అప్పటికే పండంటి బిడ్డను ప్రసవించిన అనసూయ తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను వెంటనే ఆ వాహనంలో కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. ఆ సమయంలో వైద్యాధికారులు ఎవ్వరూ లేక పోవడంతో ఇన్చార్జ్ బాధ్యతల్లో ఉన్న రావాడ రామభద్రపురం పీహెచ్‌సీకి చెందిన వైద్యాధికారి శ్రీకాంత్ వైద్యసేవలు అందించారు. అప్పటికే పరిస్థితి విషమించటంతో బాలింత మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందకే... ఈ నెల 5వ తేదీన తోయక అనసూయ కురుపాం సీహెచ్‌సీలో మలేరియా బారిన పడి చికిత్స కూడా పొందింది. అప్పట్లో వైద్య తనిఖీలు చేసిన సిబ్బంది రక్త హీనతతో ఉన్నట్లు నిర్ధారించి హైరిస్క్ గర్భిణిగా గుర్తించారు. ఇలాంటివారిని ముందుగానే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్లి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలి. కాని ఈ గర్భిణి విషయంలో అలా జరగకపోవడంతోపాటు సకాలంలో 108 వాహనం చేరుకోక ఇంట్లోనే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో మృత్యువాత పడిందని భర్త కృష్ణతోపాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆక్సిజన్ అందక బాలింత మృతి సాలూరురూరల్: మండలంలోని బాగువలస గ్రామానికి చెందిన చింతాడ చిన్నమ్మలు(20) అనే బాలింత ఆక్సిజన్ అందక సోమవారం మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నమ్మలుకు సోమవారం పురిటినొప్పులు రావడంతో ఆమెను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యురాలు ఆమెకు ప్రసవ సేవలందించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం ప్రారంభమవ్వడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పరిస్దితి విషమంగా మారినట్లు గుర్తించిన వైద్యురాలు విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి ప్రభుత్వ అంబులెన్స్‌లో తీసుకువెళ్తుండగా ఆక్సిజన్ అందక మార్గమద్యంలోనే మృతి చెందింది. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడం వల్లే బాలింత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన అశోక్, బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు ప్రేమించుకున్నారు. గతేడాది పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన తన భార్య మృతి చెందడంతో అశోక్ కన్నీరు మున్నీరవుతున్నారు. -
హతవిధీ..! మళ్లీ మొదటికి..!!
సుల్తాన్‌బజార్‌లో మళ్లీ నిలిచిన సిజేరియన్లు బాలింతల మరణాలపై నిరసన వెల్లువ మంత్రిని అడ్డుకున్న బీజేపీ మహిళా నేతలు.. సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మళ్లీ సిజేరియన్లు నిలిపివేశారు. నెలరోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లు మూసి వేయడం రెండోసారి. శనివారం సాధారణ ప్రసవాలు మినహా ఎలాంటి సిజేరియన్లు చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను నిలోఫర్‌కు తరలిస్తున్నారు. ఆస్పత్రిలో వరుసగా బాలింతలు ప్రాణాలు కోల్పోతుండడంతో వైద్యులు తాత్కాలికంగా ఓటీలను బంద్ చేసి, ఫ్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టారు. గురువారం పది మందికి సిజేరియన్లు చేయగా, వీరిలో ఆరుగురు బాలింతల పరిస్థితి విషమించింది. దీంతో రోగులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఓటీలను మరోసారి మూసివేసి నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి ఆపరేషన్ థియేటర్లను మూసివేశారు. డీఎంఈ కార్యాలయంవద్ద ఉద్రిక్తత.. బాలింతల వరస మరణాలపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సుఖ ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన నిరుపేద గర్భిణుల ప్రాణాలకు బరోసా కల్పించలేకపోతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో టీకాల బండిని ప్రారంభించేందుకు డీఎంఈ కార్యాలయానికి వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డిని అడ్డుకునేందుకు ఆందోళన కారులు సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లోకి దూసుకు వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు మంత్రిని డీఎంఈ భవనంలోనికి తీసుకువెళ్లడంతో వారంతా అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు మహిళా పోలీసు బలగాలను రప్పించి బీజేపీ మహిళా నేతలను అరెస్ట్ చేశారు. ఘర్షణలో ఓ మహిళానేత చేతికి గాయమైంది. ఉస్మానియాలో మంత్రికి నిరసన సెగ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఉస్మానియాలో సైతం నిరసన సెగ తగిలింది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన డిజిట్ ఎక్స్‌రే ల్యాబ్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్, వెయింటింగ్ హాల్, నాలుగు ఫార్మసీ కౌంటర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులకు సరైన గుర్తింపు ఇవ్వడంలేదని, పదోన్నతి కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆస్పత్రికి చెందిన నర్సులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో నర్సుల కొరత అధికంగా ఉందని, రెండు మూడు వార్డులకు ఒక్కరే సేవలు అందించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడమే కాకుండా నర్సులపై భారం పడుతోందన్నారు. రోగుల నిష్పతికి తగినన్ని నర్సింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కారణం ఇదీ.. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రి శుక్రవారం జన్మించిన ఓ నవజాత శిశువు శనివారం నిలోఫర్‌లో మృతి చెందింది. సరూర్‌నగర్ మండలం గుర్రంగూడకు చెందిన సాంబశివరావు భార్య కాన్పుకోసం శుక్రవారం సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో చేరింది. అదేరోజు రాత్రి అప్పుడే జన్మించిన శిశువుకి పాలు పట్టించారు. 10.30కు బిడ్డకు ఫిట్స్ రావడంతో నిలోఫర్‌కు రిఫర్కు తరలించారు. శనివారం తెల్లవారుజామున శిశువు మృతి చెందింది. దీంతో సుల్తాన్‌బజార్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ శిశువు చనిపోయిందని బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. పేట్లబురుజులో ‘ఒఐసీయూ’ ప్రారంభం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.1.64 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అబ్స్ట్రక్టివ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఒఐసీయూ)ను శనివారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆస్పత్రి, నిలోఫర్ సహా పలు ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో కూడా ఈ క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
తగ్గిన శిశుమరణాల రేటు
57 నుంచి 41 శాతానికి దిగివచ్చిన ఐఎంఆర్ • దేశంలో మెరుగైన లింగనిష్పత్తి • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: గత పదేళ్లలో శిశుమరణాల రేటు(ఐఎంఆర్) దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని సర్వేలో తేలింది. 2005–06లో ప్రతి వేయి మంది శిశువులకు 57 మంది చనిపోతుండగా 2015–16నాటికి ఆ రేటు 41కి పడిపోయింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్ , ఒడిశాల్లో ఐఎంఆర్ సుమారు 20 శాతానికి పైగా తగ్గింది. మంగళవారం విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ ఎఫ్హెచ్ఎస్–4) ప్రకారం...జనన సమయంలో లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది. ఈ జాబితాలో కేరళ(1047), మేఘాలయ(1009), ఛత్తీస్‌గఢ్(977) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 38.7 శాతం నుంచి 78.9 శాతానికి పెరిగింది. తక్కువ బరువున్న పిల్లల శాతం 7 శాతం తగ్గిందని తెలిపింది. 6–59 నెలల మధ్యనున్న పిల్లల్లో అనీమి యా 69 శాతం నుంచి 59 శాతానికి దిగివచ్చినట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 6 లక్షల గృహాలు, 7 లక్షల మహిళలు, 1.3 లక్షల పురుషుల నుంచి సమాచారం సేకరించి ఈ సర్వే జరిపారు. ఈసారి జిల్లాలవారీగా కూడా గణాంకాలు తయారు చేశారు. అనవసర సిజేరియన్ లు వద్దు అనవసర సిజేరియన్ చికిత్సలను కట్టడిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. ప్రైవేట్ రంగంలో ఇవి ఒక్కసారిగా పెరిగాయని సర్వే సూచించిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2005–06లో(ఎన్ ఎఫ్హెచ్ఎస్–3) 8.5 శాతంగా ఉన్న జాతీయ సగటు సిజేరియన్ శస్త్రచికిత్సలు 2015–16 నాటికి 17.2 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ రంగంలో ఇవి 2005–06లో 27.7 శాతంగా ఉండగా 2015–16 నాటికి 40 శాతానికి చేరాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ చికిత్సలు 2015–16 కాలానికి 15.2 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయాయి. అవసరమైనప్పుడే సిజేరియన్ ఆపరేషన్లు చేసేలా ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించాలని రాష్ట్రాలను కోరుతున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా విలేకర్లతో చెప్పారు. -
రోజూ 16 వేల శిశు మరణాలు!
* ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల బలి * ఈ ఏడాది మరణానికి చేరువలో 59 లక్షల మంది * పౌష్టికాహార లోపం, రోగాలే ప్రధాన కారణం * యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడి హ్యూస్టన్: ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు నేటికీ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాల్లో రోజూ 16 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాతపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పౌష్టికాహార లోపం, నివారించదగ్గ రోగాల వల్ల ఈ ఏడాది 59 లక్షల మంది చిన్నారులు ఐదో పుట్టినరోజు జరుపుకునేలోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 1990లో ఏటా 1.27 కోట్లుగా నమోదైన శిశు మరణాల రేటు 2015 నాటికి 50 శాతానికిపైగా తగ్గి 60 లక్షలకన్నా తక్కువకు చేరుకున్నప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మరణాల రేటూ ఎక్కువేనని అభిప్రాయపడింది.పౌష్టికాహార లేమి వల్ల 50 శాతం శిశుమరణాలు సంభవిస్తున్నాయని...పుట్టిన 28 రోజుల్లో మరణిస్తున్న శిశువుల సంఖ్య 45 శాతంగా ఉందని వివరించింది. నెలలు నిండక ముందే పుట్టడం, న్యుమోనియా, ప్రసవం సమయంలో సమస్యలు, విరేచనాలు, మలేరియా వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణాలని తెలిపింది. ఈ కారణాలకు తోడు శివువులు పుట్టే ప్రాంతమూ శిశు మరణాల రేటులో కీలక పాత్ర పోషిస్తోందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాల్లో (సబ్ సహారన్ ఆఫ్రికా) ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నట్లు వివరించింది. అక్కడ ప్రతి 12 మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నారని...అధిక ఆదాయ దేశాల్లోని శిశు మరణాల రేటు కన్నా ఇది 12 రెట్లు అధికమని యునిసెఫ్ నివే దిక పేర్కొంది. అధిక ఆదాయ దేశాల్లో సగటున ప్రతి 147 మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నట్లు వివరించింది. శిశు మరణాలను తగ్గించే చర్యలను వేగవంతం చేయడం ద్వారా 3.80 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులను కాపాడవచ్చని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాల నివారణకు తీసుకుంటున్న చర్యల కారణంగా 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా 4.8 కోట్ల మంది చిన్నారులు మృత్యుముఖం నుంచి బయటపడ్డట్లు తెలిపింది. 2030 నాటికి ప్రతి వెయ్యి మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటును 25 లేదా అంతకన్నా తక్కువకు తగ్గించాలని నూతన లక్ష్యం నిర్దేశించుకుంటున్నట్లు నివేదికలో పేర్కొంది. నవజాత శిశువులకు కేవలం తల్లిపాలు అందించడం, అనారోగ్యానికి గురయ్యే శిశువుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం తదితర చర్యల ద్వారా ఏటా వేలాది మంది శిశువులను కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఫ్లావియా బుస్ట్రియో తెలిపారు. -
డయేరియాతోనే 13 శాతం శిశు మరణాలు
దోమ/పరిగి : ఐదేళ్ల లోపు శిశువులు, చిన్నపిల్లల మరణాల్లో 13 శాతం డయేరియా (నీళ్ల విరేచనాలు) వల్లే సంభవిస్తున్నాయని జిల్లా శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాల అధికారి (జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి) నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. నీళ్ల విరేచనాలు కావడానికి గల కారణాలు, నివారణ మార్గాలపై ఆయన దోమ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిగి ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో నీరు, లవణాల శాతం గణనీయంగా తగ్గిపోయి ప్రాణాంతక పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీనిని అరికట్టడం సులభమని, తగు జా గ్రత్తలతో ఇంటి వద్దే చికిత్స అందించే వీలుందన్నారు. విరేచనాల బారిన పడే చిన్నారులకు తల్లిపాలతో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తా గించాలని సూచించారు. జింక్ మాత్రలు వేయ డం ద్వారా విరేచనాలను నియంత్రించే వీలుం టుందన్నారు. పిల్లలు నలతగా, సుస్తీగా ఉండి తల్లి పాలను తాగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. పక్షోత్సవాల్లో భాగంగా మొదటి వారం గ్రామాల్లో వైద్య బృందం పర్యటించి ఐదేళ్లలోపు పిల్లలున్న ఇళ్లలో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, జింకు మాత్రలు అందజేస్తామని తెలిపా రు. రెండో వారంలో తల్లులు పిల్లలకు పాలు పట్టే విధానం ఇతర జాగ్రత్తలపై శిక్షణ ఇస్తామన్నారు. పై కార్యక్రమాల్లో పీహెచ్సీ వైద్యాధికారి టీ కృష్ణ, గణాంకాధికారి కృష్ణ, సామాజిక ఆరోగ్య అధికారి కే బాలరాజు, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురంధర దాస్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు తగ్గిస్తాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:‘ఆశ కార్యకర్త నుంచి డీఎంహెచ్‌వో వరకు.. అందరూ బాధ్యతగా పనిచేయాల్సిందే, ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు. గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో జిల్లా వైద్యరంగాన్ని తీర్చిదిద్దుతాను. మాది పొరుగు జిల్లాయే. అందువల్ల శ్రీకాకుళం జిల్లా భౌగోళిక పరిస్థితులు, సమస్యలపై నాకు అవగాహన ఉంది. నాది కష్టపడే మనస్తత్వం. ఎక్కువగా సెలవులు పెట్టడం ఇష్టం ఉండదు. మాతా శిశు మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తాం. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తాం’ అని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారి రెడ్డి శ్యామల స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆమె మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నిరంతర సేవలు జిల్లాలో 24 గంటలూ పని చేసే ఆస్పత్రులు 26 ఉన్నాయి. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయా ఆస్పత్రులకు రోగులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 108 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. సిబ్బంది కొరత ఉన్నా భవిష్యత్తులో దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఆస్పత్రిలో 10 కాన్పులకు మించి చేస్తే ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వం రూ.56 డైట్‌చార్జీలు చెల్లిస్తుంది. ప్రోత్సాహకం కింద రూ.1000 చెల్లిస్తుంది. 108 వాహనంలోనే రావాలి. 108లోనే వెళ్లాలి. జిల్లాలోని మెరుగైన వైద్య సేవలకు సంబంధించి ఆరోగ్యశాఖ కమిషనర్ నుంచి భారీగా నిధులు వచ్చేలా ప్రయత్నిస్తాం. నాలుగేళ్లు ఇక్కడ పని చేశా 1987 నుంచి 1990 వరకు ఈ జిల్లాలోనే పనిచేశా. అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు, రవాణా లేదు. నెట్వర్క్ ఇబ్బంది చాలా ఎక్కువ. అయినా మారుమూల ప్రాంతంలో సీనియర్లతో కలిసి పనిచేశా. తరువాత అనేక విభాగాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది. ఆ అనుభవంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తా. సిబ్బంది సమష్టిగా పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు. విశాఖ జిల్లాలో వివిధ హోదాల్లో ఏడేళ్లపాటు పనిచేశా. అక్కడున్నంత గిరిజన ప్రాంతం మరెక్కడా లేదు. అయినా గ్రామగ్రామానా పర్యటించా.విశాఖతో పోల్చుకుంటే జనాభా పరంగా, ఇబ్బందుల పరంగా ఇక్కడ తక్కువ. అయినా కష్ట పనిచేస్తా. సెలవులు అధికంగా పెట్టడం నాకు ఇష్టం ఉండదు. హైరిస్క్‌ను ముందే గుర్తిస్తాం గర్భిణులకు వైద్యం అందించే క్రమంలో ‘హైరిస్క్’ ఉంటే ముందే గుర్తించి వారిని రిఫరల్ ఆస్పత్రులకు పంపిస్తాం. వాస్తవానికి గర్భిణుల పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పరిశీలిస్తుంటా రు. రిఫరల్‌కు పంపించినప్పుడు కూడా ఆ తరహా కేసుల్ని నిరంతరం సమీక్షిస్తుంటారు. గర్భస్థ మృతుల (మెటర్నిటీ డెత్స్) సంఖ్యను తగ్గిం చేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోంది. వైద్యసిబ్బందిపై ఇప్పటికే ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తాను. గతంలో పలు ఇబ్బందులున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. వాటన్నింటినీ అధిగమించి మోడల్ జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దుతాం. వైద్యసేవలకు సంబంధిం చి ఏ సమస్య ఎదురైనా 99639-94336 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. -
శిశుమరణాలపై ప్రభుత్వానికి నోటీసు
ధర్మపురి, సేలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా శిశువులు మరణించడంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల మరణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: ధర్మపురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల్లో 6 మంది శిశువులు మృతి చెందగా ఆ తరువాత కూడా మరో ఐదుగురు చిన్నారుల మరణాలు కొనసాగాయి. ధర్మపురి ఆస్పత్రి నుంచి సేలం ప్రభుత్వాస్పత్రికి ఆరుగురు చిన్నారులను తరలించారు. వారిలో ఇద్దరు కన్నుమూశారు. అప్పటికే సేలం ప్రభుత్వాస్పత్రిలో పది మంది చిన్నారులు మృతి చెందారు. శిశువుల వరుస మరణాలపై రాష్ట్ర ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేయగా, ప్రభుత్వం రెండు వైద్య బృందాలను ధర్మపురి, సేలంకు పంపింది. ఎక్కువ శాతం కోలుకుంటున్నా మరణాలు మాత్రం ఆగలేదు. సేలం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో సుమారు వంద మంది చికిత్స పొందుతుండగా, మూడు రోజుల్లో మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. రెండు ఆస్పత్రులు కలుపుకుని శుక్రవారం నాటికి చిన్నారుల మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఎమర్జెన్సీ, ఈసీయూ వార్డుల్లోని పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సుమోటోగా స్వీకరణ ధర్మపురి,సేలం ఆస్పత్రుల్లో శిశువుల మరణాలపై మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసినట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు టీ మురుగేశన్ చెప్పారు. పురిటిబిడ్డల వరుస మరణాలను కమిషన్ తీవ్రంగానూ, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ధర్మపురి, సేలం జిల్లాల కలె క్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మరణాలపై నాలుగు వారాల్లోగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. -
పసి ప్రాణాలు పుటుక్కు..!
సాక్షి, గుంటూరు :జిల్లాలో శిశు మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ కొన్ని వేల మంది చిన్నారులు విరేచనాలు, ఊపిరితిత్తుల వ్యాధు లతో మరణిస్తున్నారు. పుట్టిన వెయ్యిమంది పసికందుల్లో 60 మంది ఏడాదిలోపు చనిపోతుంటే, మిగిలిన వారిలో సగం మంది పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఆర్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కేటాయిస్తున్నా, నిధులను సరిగా ఖర్చు చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద కేటాయిస్తున్న నిధులలో సింహభాగం సిబ్బంది జీతభత్యా లకు ఖర్చు చేస్తున్నారే తప్ప చిన్నారుల ఆరోగ్యం మెరుగుకు ప్రణాళికలేవీ రూపొందించడం లేదు. శిశు మరణాల రేటు ప్రస్తుతమున్న 42.1 నుంచి 20 లోపుగా ఎన్హెచ్ఆర్ఎం కింద తగ్గించేందుకు భారత ప్రభుత్వం లక్ష్యాల్ని నిర్ధేశించినా వైద్య ఆరోగ్య శాఖ పెడచెవిన పెడుతోంది. ముఖ్యంగా గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో శిశు మరణాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. జీజీహెచ్‌లో వైద్యం కోసం చేరుతున్న చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జిల్లాలో 2012లో 3,015 మందిని వైద్యం కోసం చేర్పిస్తే, 955 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2013లో 2,902 మందిని చేర్పించగా, 902 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనిపై పలు ప్రజా సంఘాలు ఆందోళనలు, ఫిర్యాదులు చేశాయి. శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి ఫిబ్రవరి 13లోగా నివేదిక సమర్పించాలని కలెక్టరుతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే! శిశు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీజీహెచ్‌లో శిశు సంరక్షణకు అనువైన సౌకర్యాలు కానీ, మౌలిక సదుపాయాలేవీ లేవు. అధునాతన పరికరాలు కూడా లేకపోవడంతో చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉంది. వార్మర్లు, ఫొటోథెరపి యూనిట్లు, వెంటిలేటర్లు వంటి పరికరాలు లేవు. ముఖ్యంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. చిన్నారుల నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియూ)లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్కో పడకకు ఒక్కో నర్సు అందుబాటులో ఉండాలి. కానీ పదిహేను పడకలకు ఒక్క నర్సు మాత్రమే ఉండటం గమనార్హం. కేంద్రం విడుదల చేసిన రూ.20 కోట్ల నిధులతో జీజీహెచ్ ఆవరణలోనే మాతా శిశు సంరక్షణ నిమిత్తం ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు ఇటీవలే జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ ప్రకటించారు. పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద మంజూరు, ఖర్చుల వివరాలివే.. సంవత్సరం మంజూరు ఖర్చు 2005-06 1.16 కోట్లు 1.10 కోట్లు 2006-07 2.42 కోట్లు 2.35 కోట్లు 2007-08 2.67 కోట్లు 2.40 కోట్లు 2008-09 2.80 కోట్లు 2.72 కోట్లు 2009-10 3.02 కోట్లు 2.80 కోట్లు 2010-11 3.27 కోట్లు 3.05 కోట్లు 2011-12 3.48 కోట్లు 3.12 కోట్లు 2012-13 3.62 కోట్లు 3.27 కోట్లు -
శిశుమరణాల్లో నం.1
న్యూఢిల్లీ: మనదేశంలోని మహానగరాల్లో ఢిల్లీలోనే అత్యధికంగా శిశుమరణాలు (వెయ్యికి 28 మంది) సంభవిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో 84 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతుండగా, వీటిలో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. ఇంట్లో నిర్వహించే 66 శాతం ప్రసవాలకు డాక్టర్లు, నర్సులు లేదా మంత్రసానులు హాజరవుతున్నా శిశుమరణాలు తగ్గడం లేదు. పుట్టిన నాలుగు వారాల్లోపు బిడ్డ మరణిస్తే దానిని శిశుమరణంగా పరిగణిస్తారు. అంతేకాదు ఢిల్లీలో 72 శాతం మంది చిన్నారులకు మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో వేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈశాన్య, నైరుతి జిల్లాల్లో ఇది 50 శాతం మించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధానిలో ప్రభుత్వ వైద్యసదుపాయాలను 60 శాతం మంది వినియోగించుకుంటున్నట్టు రికార్డులు చెబుతున్నా ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన చికిత్సలు అందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఇద్దరు వైద్య అధికారులు నిత్యం 400 మంది వరకు రోగులను చూస్తుంటారు. అంటే ఒక్కో రోగికి కనీసం మూడు నిమిషాలు కూడా కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. నగర జనాభాలో 23 శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం డాక్టర్లు, 20 శాతం వైద్యసిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి 10 వేల మందికి కేవలం 3.89 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారంటే కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికస్థాయిలో కూడా నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి 3.33 ఆస్పత్రి పడకలు ఉండాలి. ఢిల్లీలో 24 శాతం తక్కువగా, అంటే కేవలం 42,467 పడకలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో పడకల పరిస్థితి ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది. నగరానికి మరో 13,300పైగా పడకలు అవసరమని 2011లో అంచనా వేసి కొత్తగా 11 ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఇవి పూర్తయితే 2,900 పడకలు అందుబాటులోకి వస్తాయి. వీటిలో ఏ ఒక్క ఆస్పత్రి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల వినియోగం 72 శాతం మాత్రమే ఉందని ప్రభుత్వం ప్రాంతీయ ప్రణాళిక 2021లో పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇది 53 శాతంగా తేలింది. అత్యవసర ఔషధాల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించుకున్నా వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రభుత్వ, మున్సిపల్ ఆస్పత్రుల్లో నామమాత్రంగానే అత్యవసర ఔషధాలను సరఫరా చేస్తున్నారని, ఉన్నవాటిలోనే జెనరిక్ ఔషధాలే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు దుకాణాల్లోనే మందులు కొనుక్కోవాల్సి వస్తోంది. అత్యవసర ఔషధాల సేకరణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, వాటి పంపిణీ కూడా సక్రమంగా లేదని ఢిల్లీ మానవాభివృద్ది నివేదిక విమర్శించింది.