పసి ప్రాణాలు పుటుక్కు..!
Published Thu, Jan 16 2014 12:53 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :జిల్లాలో శిశు మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ కొన్ని వేల మంది చిన్నారులు విరేచనాలు, ఊపిరితిత్తుల వ్యాధు లతో మరణిస్తున్నారు. పుట్టిన వెయ్యిమంది పసికందుల్లో 60 మంది ఏడాదిలోపు చనిపోతుంటే, మిగిలిన వారిలో సగం మంది పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కేటాయిస్తున్నా, నిధులను సరిగా ఖర్చు చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద కేటాయిస్తున్న నిధులలో సింహభాగం సిబ్బంది జీతభత్యా లకు ఖర్చు చేస్తున్నారే తప్ప చిన్నారుల ఆరోగ్యం మెరుగుకు ప్రణాళికలేవీ రూపొందించడం లేదు.
శిశు మరణాల రేటు ప్రస్తుతమున్న 42.1 నుంచి 20 లోపుగా ఎన్‌హెచ్‌ఆర్‌ఎం కింద తగ్గించేందుకు భారత ప్రభుత్వం లక్ష్యాల్ని నిర్ధేశించినా వైద్య ఆరోగ్య శాఖ పెడచెవిన పెడుతోంది. ముఖ్యంగా గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో శిశు మరణాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. జీజీహెచ్‌లో వైద్యం కోసం చేరుతున్న చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జిల్లాలో 2012లో 3,015 మందిని వైద్యం కోసం చేర్పిస్తే, 955 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2013లో 2,902 మందిని చేర్పించగా, 902 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనిపై పలు ప్రజా సంఘాలు ఆందోళనలు, ఫిర్యాదులు చేశాయి. శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి ఫిబ్రవరి 13లోగా నివేదిక సమర్పించాలని కలెక్టరుతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే!
శిశు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీజీహెచ్‌లో శిశు సంరక్షణకు అనువైన సౌకర్యాలు కానీ, మౌలిక సదుపాయాలేవీ లేవు. అధునాతన పరికరాలు కూడా లేకపోవడంతో చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉంది. వార్మర్లు, ఫొటోథెరపి యూనిట్లు, వెంటిలేటర్లు వంటి పరికరాలు లేవు. ముఖ్యంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. చిన్నారుల నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియూ)లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్కో పడకకు ఒక్కో నర్సు అందుబాటులో ఉండాలి. కానీ పదిహేను పడకలకు ఒక్క నర్సు మాత్రమే ఉండటం గమనార్హం. కేంద్రం విడుదల చేసిన రూ.20 కోట్ల నిధులతో జీజీహెచ్ ఆవరణలోనే మాతా శిశు సంరక్షణ నిమిత్తం ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు ఇటీవలే జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ ప్రకటించారు.
పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద మంజూరు, ఖర్చుల వివరాలివే..
సంవత్సరం మంజూరు ఖర్చు
2005-06 1.16 కోట్లు 1.10 కోట్లు
2006-07 2.42 కోట్లు 2.35 కోట్లు
2007-08 2.67 కోట్లు 2.40 కోట్లు
2008-09 2.80 కోట్లు 2.72 కోట్లు
2009-10 3.02 కోట్లు 2.80 కోట్లు
2010-11 3.27 కోట్లు 3.05 కోట్లు
2011-12 3.48 కోట్లు 3.12 కోట్లు
2012-13 3.62 కోట్లు 3.27 కోట్లు
Advertisement
Advertisement