శిశుమరణాల్లో నం.1
Published Mon, Dec 2 2013 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
న్యూఢిల్లీ: మనదేశంలోని మహానగరాల్లో ఢిల్లీలోనే అత్యధికంగా శిశుమరణాలు (వెయ్యికి 28 మంది) సంభవిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో 84 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతుండగా, వీటిలో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. ఇంట్లో నిర్వహించే 66 శాతం ప్రసవాలకు డాక్టర్లు, నర్సులు లేదా మంత్రసానులు హాజరవుతున్నా శిశుమరణాలు తగ్గడం లేదు. పుట్టిన నాలుగు వారాల్లోపు బిడ్డ మరణిస్తే దానిని శిశుమరణంగా పరిగణిస్తారు. అంతేకాదు ఢిల్లీలో 72 శాతం మంది చిన్నారులకు మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో వేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఈశాన్య, నైరుతి జిల్లాల్లో ఇది 50 శాతం మించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధానిలో ప్రభుత్వ వైద్యసదుపాయాలను 60 శాతం మంది వినియోగించుకుంటున్నట్టు రికార్డులు చెబుతున్నా ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన చికిత్సలు అందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఇద్దరు వైద్య అధికారులు నిత్యం 400 మంది వరకు రోగులను చూస్తుంటారు. అంటే ఒక్కో రోగికి కనీసం మూడు నిమిషాలు కూడా కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. నగర జనాభాలో 23 శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం డాక్టర్లు, 20 శాతం వైద్యసిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి 10 వేల మందికి కేవలం 3.89 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారంటే కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికస్థాయిలో కూడా నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి 3.33 ఆస్పత్రి పడకలు ఉండాలి. ఢిల్లీలో 24 శాతం తక్కువగా, అంటే కేవలం 42,467 పడకలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో పడకల పరిస్థితి ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది. నగరానికి మరో 13,300పైగా పడకలు అవసరమని 2011లో అంచనా వేసి కొత్తగా 11 ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
ఇవి పూర్తయితే 2,900 పడకలు అందుబాటులోకి వస్తాయి. వీటిలో ఏ ఒక్క ఆస్పత్రి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల వినియోగం 72 శాతం మాత్రమే ఉందని ప్రభుత్వం ప్రాంతీయ ప్రణాళిక 2021లో పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇది 53 శాతంగా తేలింది. అత్యవసర ఔషధాల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించుకున్నా వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రభుత్వ, మున్సిపల్ ఆస్పత్రుల్లో నామమాత్రంగానే అత్యవసర ఔషధాలను సరఫరా చేస్తున్నారని, ఉన్నవాటిలోనే జెనరిక్ ఔషధాలే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు దుకాణాల్లోనే మందులు కొనుక్కోవాల్సి వస్తోంది. అత్యవసర ఔషధాల సేకరణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, వాటి పంపిణీ కూడా సక్రమంగా లేదని ఢిల్లీ మానవాభివృద్ది నివేదిక విమర్శించింది.
Advertisement