న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. జనన , మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో ఉచితంగా పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం స్థానిక లోహియా ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో ప్రసవమైన ఓ మహిళకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. శ్రీవాస్తవ ఈ సందర్భంగా జనన ధ్రువీకరణ పత్రాన్ని ఉచితంగా అందజేశారు. ఈ ఆస్పత్రిలో మొత్తం ఐదుగురికి ఆయన ఈ పత్రాలను అందజేశారు. ఈ ఆస్పత్రిలో ప్రతి నెలా సగటున 1,500 మరణాలు, జననాలు సంభవిస్తుంటాయన్నారు. కనీసం 500 పడకలు కలిగిన నగరంలోని మిగతా ఆస్పత్రులకు ఈ వెసులుబాటును త్వరలో విస్తరిస్తామన్నారు.
జీటీబీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, భీమ్‌రాం అంబేద్కర్ తదితర ఆస్పత్రుల్లో 500 పడకలున్నాయి. మృతుడి సమీప బంధువుకి మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారన్నారు. ప్రస్తుతం నగరంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు నమోదు చేస్తున్నాయి. దీంతోపాటు ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు కూడా వీటిని నమోదు చేస్తోంది. అయితే ఇక ఆస్పత్రుల్లోనూ ఈ వసతి కల్పించనుండడంతో కార్పొరేషన్లు లేదా కంటోన్మెంట్ బోర్డులకు పనిభారం కొంతమేర తగ్గడం ఖాయం.
జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు ఇక ఉచితం
Published Sun, Jun 15 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement