ధర్మపురి, సేలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా శిశువులు మరణించడంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల మరణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ధర్మపురి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల్లో 6 మంది శిశువులు మృతి చెందగా ఆ తరువాత కూడా మరో ఐదుగురు చిన్నారుల మరణాలు కొనసాగాయి. ధర్మపురి ఆస్పత్రి నుంచి సేలం ప్రభుత్వాస్పత్రికి ఆరుగురు చిన్నారులను తరలించారు. వారిలో ఇద్దరు కన్నుమూశారు. అప్పటికే సేలం ప్రభుత్వాస్పత్రిలో పది మంది చిన్నారులు మృతి చెందారు. శిశువుల వరుస మరణాలపై రాష్ట్ర ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేయగా, ప్రభుత్వం రెండు వైద్య బృందాలను ధర్మపురి, సేలంకు పంపింది. ఎక్కువ శాతం కోలుకుంటున్నా మరణాలు మాత్రం ఆగలేదు. సేలం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో సుమారు వంద మంది చికిత్స పొందుతుండగా, మూడు రోజుల్లో మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. రెండు ఆస్పత్రులు కలుపుకుని శుక్రవారం నాటికి చిన్నారుల మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఎమర్జెన్సీ, ఈసీయూ వార్డుల్లోని పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
సుమోటోగా స్వీకరణ
ధర్మపురి,సేలం ఆస్పత్రుల్లో శిశువుల మరణాలపై మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసినట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు టీ మురుగేశన్ చెప్పారు. పురిటిబిడ్డల వరుస మరణాలను కమిషన్ తీవ్రంగానూ, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ధర్మపురి, సేలం జిల్లాల కలె క్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మరణాలపై నాలుగు వారాల్లోగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు.
శిశుమరణాలపై ప్రభుత్వానికి నోటీసు
Published Sun, Nov 23 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement