హతవిధీ..! మళ్లీ మొదటికి..!! | Cesareans who reinstate in Sulthan Bazar | Sakshi
Sakshi News home page

హతవిధీ..! మళ్లీ మొదటికి..!!

Published Sat, May 6 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

హతవిధీ..! మళ్లీ మొదటికి..!!

హతవిధీ..! మళ్లీ మొదటికి..!!

సుల్తాన్‌బజార్‌లో మళ్లీ నిలిచిన సిజేరియన్లు
బాలింతల మరణాలపై నిరసన వెల్లువ
మంత్రిని అడ్డుకున్న బీజేపీ మహిళా నేతలు..


సుల్తాన్‌బజార్‌/అఫ్జల్‌గంజ్‌: సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మళ్లీ సిజేరియన్లు నిలిపివేశారు. నెలరోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్లు మూసి వేయడం రెండోసారి. శనివారం సాధారణ ప్రసవాలు మినహా ఎలాంటి సిజేరియన్లు చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను నిలోఫర్‌కు తరలిస్తున్నారు. ఆస్పత్రిలో వరుసగా బాలింతలు ప్రాణాలు కోల్పోతుండడంతో వైద్యులు తాత్కాలికంగా ఓటీలను బంద్‌ చేసి, ఫ్యూమిగేషన్‌ ప్రక్రియ చేపట్టారు. గురువారం పది మందికి సిజేరియన్లు చేయగా, వీరిలో ఆరుగురు బాలింతల పరిస్థితి విషమించింది. దీంతో రోగులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఓటీలను మరోసారి మూసివేసి నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి ఆపరేషన్‌ థియేటర్లను మూసివేశారు.

డీఎంఈ కార్యాలయంవద్ద ఉద్రిక్తత..
బాలింతల వరస మరణాలపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రిలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సుఖ ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన నిరుపేద గర్భిణుల ప్రాణాలకు బరోసా కల్పించలేకపోతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో టీకాల బండిని ప్రారంభించేందుకు డీఎంఈ కార్యాలయానికి వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డిని అడ్డుకునేందుకు ఆందోళన కారులు సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రి నుంచి డీఎంహెచ్‌ఎస్‌ క్యాంపస్‌లోకి దూసుకు వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు మంత్రిని డీఎంఈ భవనంలోనికి తీసుకువెళ్లడంతో వారంతా అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు మహిళా పోలీసు బలగాలను రప్పించి బీజేపీ మహిళా నేతలను అరెస్ట్‌ చేశారు. ఘర్షణలో ఓ మహిళానేత చేతికి గాయమైంది.

ఉస్మానియాలో మంత్రికి నిరసన సెగ
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఉస్మానియాలో సైతం నిరసన సెగ తగిలింది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన డిజిట్‌ ఎక్స్‌రే ల్యాబ్, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్, వెయింటింగ్‌ హాల్, నాలుగు ఫార్మసీ కౌంటర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులకు సరైన గుర్తింపు ఇవ్వడంలేదని, పదోన్నతి కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆస్పత్రికి చెందిన నర్సులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో నర్సుల కొరత అధికంగా ఉందని, రెండు మూడు వార్డులకు ఒక్కరే సేవలు అందించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడమే కాకుండా నర్సులపై భారం పడుతోందన్నారు. రోగుల నిష్పతికి తగినన్ని నర్సింగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.


కారణం ఇదీ..
సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ఆస్పత్రి శుక్రవారం జన్మించిన ఓ నవజాత శిశువు శనివారం నిలోఫర్‌లో మృతి చెందింది. సరూర్‌నగర్‌ మండలం గుర్రంగూడకు చెందిన సాంబశివరావు భార్య కాన్పుకోసం శుక్రవారం సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రిలో చేరింది. అదేరోజు రాత్రి అప్పుడే జన్మించిన శిశువుకి పాలు పట్టించారు. 10.30కు బిడ్డకు ఫిట్స్‌ రావడంతో నిలోఫర్‌కు రిఫర్‌కు తరలించారు. శనివారం తెల్లవారుజామున శిశువు మృతి చెందింది. దీంతో సుల్తాన్‌బజార్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ శిశువు చనిపోయిందని బిడ్డ తల్లిదండ్రులు, బంధువులు సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రిలో ధర్నాకు దిగారు.  

పేట్లబురుజులో ‘ఒఐసీయూ’ ప్రారంభం
పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.1.64 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అబ్‌స్ట్రక్టివ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఒఐసీయూ)ను శనివారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ఆస్పత్రి, నిలోఫర్‌ సహా పలు ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో కూడా ఈ క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement