ఏ తల్లి పాడేను...
♦ సకాలంలో వైద్యం అందక బాలింత మృతి
♦ హైరిస్క్‌గా గుర్తించినా పర్యవేక్షణ కరువు
♦ ఆక్సిజన్ అందక మరో తల్లి కన్నుమూత
♦ తల్లులను కోల్పోయిన ఇద్దరు పసిబిడ్డలు
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎంతగా హెచ్చరికలు చేస్తున్నా... ఇంకా తల్లీబిడ్డల మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. సకాలంలో వైద్యం అందక... సరైన శ్రద్ధ తీసుకోక... ప్రసవసమయాన్ని సరిగా గుర్తించలేక... ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైరిస్క్‌గా గుర్తించిన ఓ గర్భిణిపై పర్యవేక్షణ కొరవడి ఓ తల్లి మృత్యువు పాలైతే... ఆక్సిజన్ అందక మరో తల్లి కన్నుమూసింది. ఈ రెండు ఘట నల్లో ఇద్దరు పసిబిడ్డలు తల్లుల ను కోల్పోయి ఒంటరిగా మిగిలారు.
విజయనగరం జిల్లా : సకాలంలో వైద్యం అందక ఓ గిరిజన గర్భిణి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలం గుమ్మిడిగూడ పంచాయతీ దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ(22)కు ఆగస్టు నెల 22వ తేదీన కాన్పు సమయంగా సంబంధిత వైద్య సిబ్బంది తెలిపారు. కాని ఆదివారం రాత్రే తీవ్ర ప్రసవ నొప్పులు రావడంతో గ్రామస్తులు 12 గంటల సమయంలో 108కు సమాచారం అందించారు.
ఆ వాహనం సోమవారం వేకువజాము 4 గంటలకు గ్రామానికి చేరుకోగా అప్పటికే పండంటి బిడ్డను ప్రసవించిన అనసూయ తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను వెంటనే ఆ వాహనంలో కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. ఆ సమయంలో వైద్యాధికారులు ఎవ్వరూ లేక పోవడంతో ఇన్‌చార్జ్ బాధ్యతల్లో ఉన్న రావాడ రామభద్రపురం పీహెచ్‌సీకి చెందిన వైద్యాధికారి శ్రీకాంత్ వైద్యసేవలు అందించారు. అప్పటికే పరిస్థితి విషమించటంతో బాలింత మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు.
సకాలంలో వైద్య సేవలు అందకే...
ఈ నెల 5వ తేదీన తోయక అనసూయ కురుపాం సీహెచ్‌సీలో మలేరియా బారిన పడి చికిత్స కూడా పొందింది. అప్పట్లో వైద్య తనిఖీలు చేసిన సిబ్బంది రక్త హీనతతో ఉన్నట్లు నిర్ధారించి హైరిస్క్ గర్భిణిగా గుర్తించారు. ఇలాంటివారిని ముందుగానే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్లి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలి. కాని ఈ గర్భిణి విషయంలో అలా జరగకపోవడంతోపాటు సకాలంలో 108 వాహనం చేరుకోక ఇంట్లోనే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో మృత్యువాత పడిందని భర్త కృష్ణతోపాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆక్సిజన్ అందక బాలింత మృతి
సాలూరురూరల్: మండలంలోని బాగువలస గ్రామానికి చెందిన చింతాడ చిన్నమ్మలు(20) అనే బాలింత ఆక్సిజన్ అందక సోమవారం మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నమ్మలుకు సోమవారం పురిటినొప్పులు రావడంతో ఆమెను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యురాలు ఆమెకు ప్రసవ సేవలందించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం ప్రారంభమవ్వడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పరిస్దితి విషమంగా మారినట్లు గుర్తించిన వైద్యురాలు విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు.
కుటుంబ సభ్యులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి ప్రభుత్వ అంబులెన్స్‌లో తీసుకువెళ్తుండగా ఆక్సిజన్ అందక మార్గమద్యంలోనే మృతి చెందింది. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడం వల్లే బాలింత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన అశోక్, బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు ప్రేమించుకున్నారు. గతేడాది పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన తన భార్య మృతి చెందడంతో అశోక్ కన్నీరు మున్నీరవుతున్నారు.