రోజూ 16 వేల శిశు మరణాలు!
* ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల బలి
* ఈ ఏడాది మరణానికి చేరువలో 59 లక్షల మంది
* పౌష్టికాహార లోపం, రోగాలే ప్రధాన కారణం
* యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడి
హ్యూస్టన్: ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు నేటికీ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తాజా నివేదికలో పేర్కొంది.
ప్రపంచ దేశాల్లో రోజూ 16 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాతపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పౌష్టికాహార లోపం, నివారించదగ్గ రోగాల వల్ల ఈ ఏడాది 59 లక్షల మంది చిన్నారులు ఐదో పుట్టినరోజు జరుపుకునేలోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 1990లో ఏటా 1.27 కోట్లుగా నమోదైన శిశు మరణాల రేటు 2015 నాటికి 50 శాతానికిపైగా తగ్గి 60 లక్షలకన్నా తక్కువకు చేరుకున్నప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మరణాల రేటూ ఎక్కువేనని అభిప్రాయపడింది.పౌష్టికాహార లేమి వల్ల 50 శాతం శిశుమరణాలు సంభవిస్తున్నాయని...పుట్టిన 28 రోజుల్లో మరణిస్తున్న శిశువుల సంఖ్య 45 శాతంగా ఉందని వివరించింది. నెలలు నిండక ముందే పుట్టడం, న్యుమోనియా, ప్రసవం సమయంలో సమస్యలు, విరేచనాలు, మలేరియా వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణాలని తెలిపింది. ఈ కారణాలకు తోడు శివువులు పుట్టే ప్రాంతమూ శిశు మరణాల రేటులో కీలక పాత్ర పోషిస్తోందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది.
సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాల్లో (సబ్ సహారన్ ఆఫ్రికా) ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నట్లు వివరించింది. అక్కడ ప్రతి 12 మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నారని...అధిక ఆదాయ దేశాల్లోని శిశు మరణాల రేటు కన్నా ఇది 12 రెట్లు అధికమని యునిసెఫ్ నివే దిక పేర్కొంది. అధిక ఆదాయ దేశాల్లో సగటున ప్రతి 147 మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నట్లు వివరించింది.
శిశు మరణాలను తగ్గించే చర్యలను వేగవంతం చేయడం ద్వారా 3.80 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులను కాపాడవచ్చని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాల నివారణకు తీసుకుంటున్న చర్యల కారణంగా 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా 4.8 కోట్ల మంది చిన్నారులు మృత్యుముఖం నుంచి బయటపడ్డట్లు తెలిపింది. 2030 నాటికి ప్రతి వెయ్యి మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటును 25 లేదా అంతకన్నా తక్కువకు తగ్గించాలని నూతన లక్ష్యం నిర్దేశించుకుంటున్నట్లు నివేదికలో పేర్కొంది.
నవజాత శిశువులకు కేవలం తల్లిపాలు అందించడం, అనారోగ్యానికి గురయ్యే శిశువుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం తదితర చర్యల ద్వారా ఏటా వేలాది మంది శిశువులను కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఫ్లావియా బుస్ట్రియో తెలిపారు.