పల్లంరాజు రాజీనామా ఉత్తుత్తేనా..!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ఎంఎంపల్లంరాజు చాలా రోజుల తర్వాత అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన మంత్రిత్వ శాఖ సమావేశంలో ఉన్నతాధికారులతో కలసి పాల్గొని సమీక్షించారు. దీంతో ఆయన రాజీనామా ఉత్తుత్తేనని భావిస్తున్నారు.
గత నెలలో పల్లంరాజు రాజీనామా చేసినా ప్రధాని ఆమోదించలేదు. కాగా ఆయన అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్నారు. గత నెల 10న జరిగిన కీలక సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. కాగా ఇంట్లో నుంచే ఫైళ్లను పరిశీలిస్తున్న సమాచారం. తాజా సమావేశానికి పల్లంరాజుతో పాటు ఉన్నత విద్య కార్యదర్శి అశోక్ థాకూర్, ప్రధాని సలహాదారు శామ్ పిట్రోడా హాజరయ్యారు. 'ప్రధానికి రాజీనామా సమర్పించి నెల రోజులయినా ఆమోదించలేదు. దీంతో విభిన్న పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నా' అని పల్లంరాజు అన్నారు. గురువారం జరిగే నిట్ సమావేశంలో కూడా ఆయన పాల్గొనవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.