M M Pallam Raju
-
కమీషన్ల కోసమే పట్టిసీమ
కాకినాడ : పట్టిసీమ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే ముందుకు తీసుకొచ్చిందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఆరోపించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనీ కోరుతూ అఖిలపక్షాలు చేపట్టిన బంద్‌లో పల్లంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లంరాజు మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు రైతుల కోసం కాదని... కేవలం కమీషన్ల కోసమే టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారణంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా గురించి కనీసం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని.. బీజేపీ ప్రభుత్వం ప్రణాళికా సంఘంతో సమీక్షించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడే ఉందని తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పల్లంరాజు స్పష్టం చేశారు. -
వెంకయ్య ... మోదీ ఏమయ్యారు ?
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజకీయం చేసే అంశం కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం.ఎం. పల్లంరాజు స్పష్టం చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... 10 ఏళ్లు కావాలన్న వెంకయ్య ఏమయ్యారని ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్న మోదీ ఏమయ్యారని పల్లంరాజు ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్లు ఇస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అయితే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య డిమాండ్ చేశారు. అలాగే సాధారణ ఎన్నికల సందర్భంగా సీమాంధ్రలో పర్యటించిన మోదీ ... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సీఎం కిరణ్‌ను మార్చరు: కేంద్ర మంత్రి పళ్లంరాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చదని కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పళ్లంరాజు ప్రారంభించారు. అనంతరం పళ్లంరాజు మాట్లాడుతూ... తాను ఎప్పటికి సమైక్యవాదినే అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని ఇప్పటికికూడా పోరాడుతున్నట్లు చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైతే తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పళ్లంరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నెల 19న జీవోఎం ఎదుట తమ వాదనలు వినిపిస్తామన్నారు. కేంద్రం రాష్ట్ర విభజనపై తమదైన శైలీలో ముందుకు వెళ్తుంది. అయితే ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గత కొద్ది కాలంగా గుర్రుగా ఉంది. దాంతో సీఎం పదవిలో మరోకరిని నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో పళ్లంరాజు పైవిధంగా స్పందించారు. -
పల్లంరాజు రాజీనామా ఉత్తుత్తేనా..!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ఎంఎంపల్లంరాజు చాలా రోజుల తర్వాత అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన మంత్రిత్వ శాఖ సమావేశంలో ఉన్నతాధికారులతో కలసి పాల్గొని సమీక్షించారు. దీంతో ఆయన రాజీనామా ఉత్తుత్తేనని భావిస్తున్నారు. గత నెలలో పల్లంరాజు రాజీనామా చేసినా ప్రధాని ఆమోదించలేదు. కాగా ఆయన అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్నారు. గత నెల 10న జరిగిన కీలక సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. కాగా ఇంట్లో నుంచే ఫైళ్లను పరిశీలిస్తున్న సమాచారం. తాజా సమావేశానికి పల్లంరాజుతో పాటు ఉన్నత విద్య కార్యదర్శి అశోక్ థాకూర్, ప్రధాని సలహాదారు శామ్ పిట్రోడా హాజరయ్యారు. 'ప్రధానికి రాజీనామా సమర్పించి నెల రోజులయినా ఆమోదించలేదు. దీంతో విభిన్న పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నా' అని పల్లంరాజు అన్నారు. గురువారం జరిగే నిట్ సమావేశంలో కూడా ఆయన పాల్గొనవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. -
'మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించండి'
మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని ఎంపీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం ఎం పళ్లంరాజు కోరారు. బీహార్‌లో మధ్యాహ్న భోజనం తిని పలువురు చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఆయనీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీలకు పళ్లంరాజు లేఖ రాశారు. జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షక కమిటీతో తక్షణమే సమావేశమయి మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించాలని కోరారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎంపీలు ముందుకు రావాలన్నారు. జిల్లా స్థాయి నిఘా కమిటీలో ఎంపీలు సభ్యులుగా ఉంటారని, సీనియర్ ఎంపీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వండడానికి వినియోగించే సరుకులను పౌరసరఫరాల శాఖ నుంచి అందించేందుకు కృషి చేస్తున్నట్టు పళ్లంరాజు వెల్లడించారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అనుసరించిన అత్యవసర వైద్య ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు తెలిపారు.