కొత్త జంటలకు యోగి సర్కార్ వెరైటీ కానుక!
లక్నో: కొత్తగా పెళ్లయిన జంటలకు ప్రభుత్వం నుంచి కానుకలు, ప్రోత్సాహకాలు అనగానే ఆ జంట సంబరపడుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం కొత్త జంటలకు భిన్న పరిస్థితి ఎదురుకానుంది. యోగి యోగిత్యనాథ్ సర్కార్ తీసుకున్న వెరైటీ పెళ్లి కానుక నిర్ణయమే ఇందుకు కారణమని భావించవచ్చు. మిషన్ పరివార్ వికాస్‌లో భాగంగా కొత్తగా పెళ్లయిన జంటలకు కండోమ్‌లు, ఇతర గర్భ నిరోదక సాధనాలున్న కిట్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో కొత్తగా పెళ్లయిన జంటలకు ఆర్థికసాయం చేయడమో, లేక వారికి వంటింటి పాత్రలు ఇవ్వడమో చేస్తుంటారు కానీ మా ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ యూపీ ప్రజలు వాపోతున్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జులై 11 నుంచి యోగి సర్కార్ 'నయీ పహల్ కిట్ ఫర్ న్యూలీ వెడ్స్' అనే కిట్‌లను అందించనుంది. ఆశా కార్యకర్తలు కొత్త జంటలకు ఈ కిట్‌లను పంచి పెడతారు. కండోమ్‌లు, గర్భనిరోధక సమాచారం, సురక్షిత శృంగారం, కుటుంబ నియంత్రణ, ప్రసవానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే చిన్న బుక్‌లెట్‌ను ఈ కిట్‌లో సమకూర్చనుంది. నెయిల్ కట్టర్, అద్దం, దువ్వెన, గర్భనిరోధక మాత్రలు, జంట తువ్వాళ్లు, కర్చీఫ్‌లు ఈ కిట్‌లో ఉంటాయి. ఆశా కార్యకర్తలు కొత్త జంటల సందేహాలు నివృత్తి చేస్తారని యూపీ హెల్త్ మిషన్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. జనాభా నియంత్రించడం, సరైన సమయాల్లో కాన్పులు జరిగేలా చూసేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.