కులపిచ్చితో వీర జవానుకు అవమానం
ఆగ్రా/ఫిరోజాబాద్: దేశం కోసం ప్రాణాలర్పించిన జవాను అంత్యక్రియలకు భూమిని ఇచ్చేందుకు సొంత గ్రామస్తులు నిరాకరించారు. అగ్రకులస్తులమనే పిచ్చే ఈ ఏవగింపుకలిగించే చర్యకు తెరతీసింది. చివరికి అధికారులు జోక్యం చేసుకొని అగ్ర కులస్తులకు నచ్చజెప్పిన తర్వాతే వారు అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు. పాంపోర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో వీర్ సింగ్ అనే సీఆర్ పీఎఫ్ జవాను ప్రాణాలుకోల్పోయాడు. అతడి అంత్యక్రియలకోసం ఆదివారం ఫిరోజాబాద్ జిల్లాలోని నాగ్లా కేవల్ అనే గ్రామానికి తీసుకొచ్చారు.
ఆ గ్రామంలోని ఓ పబ్లిక్ స్థలంలో చివరి క్రతువు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, ఆ జవాను తక్కువ కులస్తుడని భావించి, ఆ చోటులో ఆ కార్యక్రమానికి తాము అనుమతించబోమని కొందరు అగ్రకులస్తులు అడ్డుచెప్పారు. అయితే, అక్కడే అంత్యక్రియలు చేయాలని, విగ్రహ స్థాపన కూడా చేయాలని జవాను తరుపు వారు డిమాండ్ చేయగా ప్రతిష్టంభన నెలకొంది. చివరకు అధికారులు జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పగా అందుకు అనుమతించారు. ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానం అని ప్రతి ఒక్కరు అంటున్నారు.