
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎటువైపు నిలవనుంది? రాష్ట్రంలో ఓట్ల సాధనలో ప్రధాన అంశమైన ‘కులం’ ఈ సారి ఎవరిని గెలిపించనుంది? అగ్రవర్ణ మద్దతుదారు బీజేపీనా? దళిత, యాదవ మద్దతుదారు ఎస్పీ– బీఎస్పీ కూటమినా? ఈ మూడు పార్టీలకు చెందని కులాలతో పాటు ప్రియాంకను రంగంలోకి దింపి గతంలో మద్దతిచ్చిన కులాలను ఆకర్షించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌నా?..
మాకూ చాన్స్ ఉంది..
యూపీలో బీజేపీ వెనుక అగ్రవర్ణాలు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పక్షాన వెనుకబడిన వర్గాలు(యాదవులు), బీఎస్పీ వైపు దళితులు (అత్యధిక జనాభా ఉన్న జాటవులు సహా) నిలుస్తారనేది సాధారణ సమీకరణం. బీజేపీ 2014 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యాదవేతర బీసీలు, జాటవేతర ఎస్పీలను కూడా తన వైపు తిప్పుకుని ఘనవిజయం సాధించింది. రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం ద్వారా ఈ వర్గాల్లో అత్యధిక జనాభాను ఆకర్షించగలిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆ వ్యూహాన్నే అమలు పరచనుందని తెలుస్తోంది. ఓటర్లు సామాజికవర్గాలవారీగా చీలిన యూపీలో కాంగ్రెస్‌కు ఇంకా తగినంత చోటు ఉందని ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం గమనార్హం. తమ పాత పునాదివర్గాలైన బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులను చెప్పుకోదగ్గ సంఖ్యలో మళ్లీ కాంగ్రెస్ గూటికి రప్పించడం పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.
కులం ప్రభావం తక్కువేం కాదు!
1990ల నుంచీ యూపీలో రాముడి పేరుతో అత్యధిక హిందువులను బీజేపీ సమీకరించగలిగినా కులం ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని గత 30 ఏళ్ల రాజకీయాలు, ఎన్నికలు నిరూపించాయి. 1991 నుంచి 2002 వరకూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అత్యధిక సీట్లతో ఆధిపత్యం చెలాయించింది. కానీ, 2007, 2012 ఎన్నికల్లో కులాల ఆధారంగా పనిచేసే ఎస్పీ, బీఎస్పీలు మెజారిటీ సీట్లు సాధించాయి.
అయినా తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా కులం ప్రభావం ఎక్కువే ఉందని అనేక ఎన్నికల సర్వేల్లో తేలింది. హిందీ రాష్ట్రాల్లో 55 శాతం ఓటర్లు తమ కులానికి చెందిన అభ్యర్థులకే ఓటేసే అవకాశాలు ఎక్కువని సీఎస్‌డీఎస్–అజీమ్ ప్రేమ్‌జీ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చెబుతోంది. మొదట్లో అగ్రవర్ణాలు కాంగ్రెస్‌కు మద్దతుదారులు. గత మూడు దశాబ్దాలుగా వారిలో అత్యధికులు బీజేపీకి దగ్గరయ్యారు. దళితులు బీఎస్పీ వైపు, యాదవులు ఎస్పీ వైపు వెళ్లారు. యాదవేతర కులాలైన కుర్మీ, కోయిరీ, లోధ, గుజ్జర్, రాజ్‌భర్, నిషాద్‌ల జనాభా 29% వరకూ ఉంది. వీరిని ఆకర్షించడం ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా మారింది.
ప్రియాంక పాచిక పారుతుందా?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం ప్రియాంక గాంధీ ముందున్న తక్షణ లక్ష్యం. అందుకు ముందుగా, ఆమె గతంలో కాంగ్రెస్‌కు పునాదిగా నిలిచి, ఇటీవలి దశాబ్దాల్లో పార్టీకి దూరమైన కులాలను మళ్లీ వెనక్కు తీసుకురావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే, మొదట్నుంచీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన బ్రాహ్మణ నేతల కుటుంబ సభ్యులను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల్లోని బ్రాహ్మణ నేతలతో కూడా ప్రియాంక గాంధీతో భేటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment