గాంధీనగర్ : పానిపురి.. ఈ ఉత్తరాది చాట్ మనకు కూడా బాగా అలవాటయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు గల్లీకో పానీపూరి బండి కనిపిస్తుంది. ఇప్పిడిప్పుడే ఓ మోస్తరు నగరాలను దాటుకుని గ్రామాల్లోకి కూడా ప్రవేశిస్తోంది. అంతలా ఈ పానిపురి మన మనసుల్ని గెల్చుకుంది. అయితే పానిపురి ప్రియులకు ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ తెలిపింది. ఇక మీదట పానిపురిని బ్యాన్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది అంతటా కాదు.. కేవలం గుజరాత్ వడోదరలో మాత్రమే.
మన దగ్గర పానిపురి, ఉత్తరాదిలో ‘గోల్‌గప్ప’ అని పిల్చుకునే ఈ చిరుతిండిని బ్యాన్ చేస్తున్నట్లు వడోదర మున్సిపల్ అధికారులు ప్రకటించారు. కారణం వీటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేయడమే. అసలే ఇది వర్షాకాలం.. అంటు వ్యాధులు అధికంగా ప్రబలే కాలం. అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతుంటాయనే ఉద్దేశంతో బయటి తిండి తినకూడదని హెచ్చరిస్తుంటారు.
పానిపూరిల తయారీల్లో కల్తీలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యశాఖ అధికారులు పట్టణంలోని దాదాపు 50 ప్రాంతాల్లోని పానిపూరి తయారి కేంద్రాలపై దాడి చేశారు.ఈ తనిఖీల్లో పాడయిపోయిన పిండి, కుళ్లిన ఆలుగడ్డలు, వినియోగించిన నూనేను వాడి పానీపూరిలు తయారి చేస్తున్నాట్లు గుర్తించామన్నారు. దాదాపు 4, 000 కేజీల పానీ పూరిలను, 3, 500 కేజీల కాబూలి శనగలు, ఆలుగడ్డలతో పాటు 1200 లీటర్ల రసాయన నీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ విషయం గురించి మున్సిపల్ శాఖ ఆరోగ్యాధికారి ఒకరు ‘పానిపూరిలు చాలా అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్నాయనే సమాచారం అందింది. అందువల్లే దాడులు నిర్వాహించాము. ఇంత అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని బ్యాన్ చేశాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment