సాక్షి, న్యూఢిల్లీ: ప్రవాసాంధ్రులు ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు చెరిపేస్తుండడంతో విశ్వమంతా తెలుగు వెలుగులు విరాజిల్లుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రెండు రోజల షికాగో పర్యటనకు వెళ్లిన ఉపరాష్ట్రపతి అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 21 తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో తెలుగువారి సత్తా చాటుతున్న ప్రవాసాంధ్రులు దేశాభివృద్ధితోపాటు సొంత రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రవాసభారతీయలు ఎక్కడున్నా మన భాష, యాస, ప్రాస, గోస మరువకూడదన్నారు. మనపద్యం, గద్యం, పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటిని గౌరవించుకొని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.
అంతరిక్షం, ఆరోగ్యం, వ్యవసాయం, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికతల్లో భారత్‌దే పైచేయి అని గుర్తు చేశారు. భారత్–అమెరికా బంధం బలపడడంలో ప్రవాస భారతీయులదే కీలకపాత్ర అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇప్పుడొక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతచేసుకుందని, కనెక్ట్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలు ప్రపంచాన్ని భారత్ ముంగిటకు తెచ్చాయని వెంకయ్య పేర్కొన్నారు. దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథనంలో నడుస్తున్నాయని, దీనికి ప్రవాసాంధ్రులు కూడా సహరించాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కష్టపడి సంపాదించి తిరిగి స్వదేశం వచ్చి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment