Meke in India
-
విశ్వమంతా తెలుగు వెలుగులే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రవాసాంధ్రులు ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు చెరిపేస్తుండడంతో విశ్వమంతా తెలుగు వెలుగులు విరాజిల్లుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రెండు రోజల షికాగో పర్యటనకు వెళ్లిన ఉపరాష్ట్రపతి అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 21 తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో తెలుగువారి సత్తా చాటుతున్న ప్రవాసాంధ్రులు దేశాభివృద్ధితోపాటు సొంత రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రవాసభారతీయలు ఎక్కడున్నా మన భాష, యాస, ప్రాస, గోస మరువకూడదన్నారు. మనపద్యం, గద్యం, పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటిని గౌరవించుకొని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. అంతరిక్షం, ఆరోగ్యం, వ్యవసాయం, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికతల్లో భారత్‌దే పైచేయి అని గుర్తు చేశారు. భారత్–అమెరికా బంధం బలపడడంలో ప్రవాస భారతీయులదే కీలకపాత్ర అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇప్పుడొక బ్రాండ్ ఇమేజ్ను సొంతచేసుకుందని, కనెక్ట్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలు ప్రపంచాన్ని భారత్ ముంగిటకు తెచ్చాయని వెంకయ్య పేర్కొన్నారు. దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథనంలో నడుస్తున్నాయని, దీనికి ప్రవాసాంధ్రులు కూడా సహరించాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కష్టపడి సంపాదించి తిరిగి స్వదేశం వచ్చి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష కోట్లతో ఫైటర్‌జెట్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) శుక్రవారం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్ఎఫ్ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్ ఇండియా కింద భారత్‌లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి. మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్–16, ఎఫ్–18 కొనుగోలుపై భారత్ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది. -
ఇండియా ఫస్ట్
సంస్కరణలతోనే విదేశీ పెట్టబడులను ఆకర్షించగలమని మోదీ ప్రభుత్వం విశ్వాసం. అందుకే దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే దృఢ సంకల్పంతో... ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీఎస్టి బిల్లు తెచ్చింది. రాష్ట్రాలను ఒప్పించి అమలు దశకు చేర్చింది. ఎఫ్‌డీఐలకు అనుమతులు, వ్యాపార అనుమతులను సరళతరం చేసింది.lమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... భారత్ పట్ల ప్రపంచదేశాల దృక్పథం బాగా మారింది. భారత్ బలమేమిటో, బలహీనతలేమిటో... మోదీకి స్పష్టంగా తెలుసు. అందుకే ‘మేకిన్ ఇండియా’ నినాదంతో విదేశీ పెట్టుబడులను, సాంకేతికతను ఆహ్వానించారు. అదే సమయంలో భారత ఉత్పత్తులకు మార్కెట్లను చూడటం అనేది కూడా భారత విదేశాంగ విధానంలో భాగమైంది. యాపిల్ లాంటి పెద్ద సంస్థ ఎంతగా ఒత్తిడి తెచ్చినా... మోదీ ప్రభుత్వం ఆ సంస్థ ఫోన్లను మరోచోటి నుంచి భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో భారత్‌లో ఫోన్ల తయారీ యూనిట్‌ను పెట్టడానికి యాపిల్ ముందుకు వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 21 రంగాల్లో 87 ఎఫ్‌డీఐ నిబంధనలను మార్చారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్లు (3,93,000 కోట్ల రూపాయలు) ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇరుగుపొరుగుకు స్నేహహస్తం... పరస్పర సహకారం, భాగస్వామ్యంతో ప్రగతి సాధ్యమని భావించి భారత్... ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చింది. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు. చిన్న, పెద్ద దేశాలనే తేడా లేకుండా స్నేహహస్తం చాచింది. ప్రధానిగా మోదీ దేశాధినేతలతో నిరంతరం సంప్రదింపులు జరపడం, పర్యటనలు చేయడం మూలంగా ప్రాంతీయ సంబంధాలు బలపడ్డాయి. ఇటీవలే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలకడానికి మోదీ ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. బంగ్లాదేశ్‌తో మిత్రుత్వానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియచెప్పారు. దశాబ్దాలపాటు కొన్ని దేశాలకు భారత్ దూరంగా ఉంది. మోదీ ప్రధాని అయ్యాక అలాంటివేమీ లేకుండా... మనకు ప్రయోజనం అనుకున్న ప్రతి దేశంతోనూ సంబంధాలు నెరుపుతున్నారు. దక్షిణాసియా దేశాల కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిన జీశాట్–9ను ఈ నెల 5న ప్రయోగించారు. 12 ఏళ్లపాటు సార్క్ దేశాలకు ఉచిత సేవలందించే ఈ ఉపగ్రహం ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయనుంది. అలాగే ఆఫ్గనిస్థాన్ పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ ఆర్థిక సహాయం చేసింది. ప్రపంచ సమస్యలపై... ప్రపంచం ముందున్న సవాళ్లపై చర్చల్లో భారత్ చొరవ తీసుకుంటోంది. బరువు బాధ్యతలు తీసుకుంటోంది. వివిధ అంశాలపై అగ్రరాజ్యాలతో, పలు ప్రపంచ, ప్రాంతీయ సంస్థలతో భారత్ కలిపి పనిచేస్తోంది. వాతావరణ మార్పు, సాంకేతిక సహకారం, తీవ్రవాదం, నైపుణ్య శిక్షణ, వాణిజ్య, సేవల ఒప్పందాలు, ఇంధన స్వాలంబన... అంతర్జాతీయ స్థాయిలో భారత్ చురుకుగా పనిచేస్తున్న రంగాలు. సాంస్కృతిక వారధి... ఆయా దేశాలతో మనకుగల సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి విలువలు, సంప్రదాయాల గురించి తరచూ మాట్లాడటం ద్వారా మోదీ చారిత్రకంగా ఇరుదేశాల మధ్య అనుబంధం ఉందనేది గుర్తుచేస్తూ బంధాలను బలోపేతం చేస్తున్నారు. జపాన్, చైనా, మంగోలియా, బంగ్లాదేశ్, శ్రీలంకలకు వెళ్లినపుడు... మోదీ అక్కడి విఖ్యాత సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు. గత ఏడాది జూన్ 21న ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచదేశాలన్నీ యోగా డేను జరుపుకొన్నాయి. ఎన్ఆర్ఐలతో సన్నిహిత సంబంధాలు... మోదీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు (ఎన్ఆర్ఐలు) చేరువయ్యేందుకు, వారిలో విశ్వాసం పాదుకొల్పడానికి గట్టి ప్రయత్నమే చేశారు. అమెరికా, బ్రిటన్లలో పెద్ద స్టేడియాల్లో వేల సంఖ్యలో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా... వారు చేస్తున్న విజ్ఞప్తులపై విదేశాంగ శాఖ సత్వరం స్పందిస్తోంది. ఏ దేశానికి వెళ్లినా... అక్కడుండే భారతీయులను కలవడం మోదీ ఒక అలవాటుగా చేసుకొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో భాగస్వాములయ్యేలా ఎన్ఆర్ఐలను ప్రొత్సహిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వపరంగా నిబంధనలను సరళతరం చేస్తామని వారిని కోరుతున్నారు. (మరిన్ని వివరాలకు చదవండి) (కొంచెం మోదం! కొంచెం ఖేదం!!) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) (మోదీ ప్రజల ప్రధానే..!) -
మేకిన్ ఇండియాలో భాగం కండి
- చైనా పెట్టుబడిదారులకు రాష్ట్రపతి ప్రణబ్ ఆహ్వానం - చైనాలోనూ భారత ఉత్పత్తులు పోటీ పడాలి గాంగ్జౌ: భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తామని, ‘మేకిన్ ఇండియా’లో చైనా పరిశ్రమలు భాగస్వామ్యం కావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా బుధవారం గ్వాంగ్జౌ భారత్-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు లాభించేలా కంపెనీల ప్రయత్నాల్ని సులభతరం చేస్తామని హామీనిచ్చారు. రెండు దేశాల ఆర్థికాభివృద్ధి కోసం అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం సమతూకం కోసం భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్‌గా మారేందుకు ప్రయత్నాలు సాగాలన్నారు. ఇరు దేశాలు ఔషధాలు, ఫార్మా, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పరం ఆధారపడ్డాయని, ఈ రంగాల్లో భారత్ ఉత్పత్తులు చైనాలో పోటీపడాలని ఆకాంక్షించారు. భారత, చైనాల మధ్య ద్వైపాక్షిక వర్తకం 2000వ సంవత్సరంలో రూ. 19,497 కోట్లుగా ఉంటే 2015 నాటికి రూ.4.76 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా భారత్ ప్రతీ ఏటా 7.6 చొప్పున వృద్ధి రేటు సాధిస్తోందని వివరించారు. విదేశీ పెట్టుబడుల కోసం సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో భారీ సంస్కరణలు చేపట్టామని, దీంతో వ్యాపారం సులభమైందని, విధానాల్లో మార్పులు చేసి పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించామని చెప్పారు. విదేశీ పెట్టుబడుదారుల కోసమే ఈ సంస్కరణలు చేపట్టామన్నారు. 2014లో విదేశీ పెట్టుబడుల్లో 32 శాతం వృద్ధి సాధించామని, 2015లో ప్రపంచంలోని భారీగా పెట్టుబడులు ఆకర్షించిన దేశాల్లో భారత్ ఒకటిగా అవతరించిందని తెలిపారు. చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని భారత్ కోరుకుంటుందని, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ పెట్టుబడులు తయారీ జోన్లు, సరకు రవాణా కారిడార్‌ల్లో ఎఫ్‌డీఐలు పెట్టాలని రాష్ట్రపతి కోరారు. 100 స్మార్ట్ నగరాల కార్యక్రమం భారత్ స్వరూపాన్ని మార్చనుందని, ఈ పథకంలో పాలుపంచుకోవాలని సూచించారు. చైనా-భారత్‌లు పాత సంబంధాల పునరుద్ధరణకు కొత్తగా చేతులు కలపాలన్నారు. కార్యక్రమలో భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామికవే త్తలు కూడా పాల్గొన్నారు. నేడు చైనా అధ్యక్షుడితో భేటీ గాంగ్జౌలో ప్రణబ్ పలువురు కమ్యూనిస్టు నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి గౌరవార్ధం గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి హ్యు చున్హువా మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా, భారత్‌ల్లో దేశం, రాష్ట్రాల సంబంధాలపై చర్చించారు. నేడు బీజింగ్‌లో ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. -
హోలీ @ మేడిన్ చైనా!
దేశీ ఉత్పత్తుల కన్నా చైనా నుంచి దిగుమతైన వాటికే డిమాండ్ ♦ రేట్ల మధ్య 55% వ్యత్యాసమే కారణం ♦ అసోచాం సర్వేలో వెల్లడి లక్నో: మేకిన్ ఇండియా.. మేకిన్ ఇండియా అంటూ మనవాళ్లు ఎంతగా ఊదరగొడుతున్నా.. ‘మేడిన్ చైనా’ ఉత్పత్తుల హవానే కొనసాగుతోంది. తాజాగా రంగుల పండుగ హోలీలో కూడా ఇదే ధోరణి కనిపించింది. దేశీ సంస్థలు తయారు చేసిన హోలీ రంగులు, పిచికారీలు, బెలూన్లు మొదలైన వాటికంటే.. చైనా నుంచి దిగుమతైన వాటికే ఎక్కువగా డిమాండ్ నెలకొంది. రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు 55 శాతం పైగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. చైనా నుంచి వచ్చిపడుతున్న చౌక దిగుమతులతో చిన్న తయారీ సంస్థల మనుగడ కష్టంగా మారుతోందని అసోచాం పేర్కొంది. దేశీ సంస్థలు తయారు చేసే ఉత్పత్తుల్లో కేవలం 25 శాతం వాటికే కొనుగోలుదారులు ఉంటున్నారని, మిగతా 75 శాతాన్ని అవి నష్టపోవాల్సి వస్తోందని వివరించింది. హోలీ రంగులు, వాటర్ గన్లు తత్సంబంధిత ఇతర ఉత్పత్తులు తయారు చేసే దాదాపు 250 పైగా సంస్థలు, విక్రేతలు, సరఫరాదారులు, ట్రేడర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా అసోచాం ఈ నివేదిక రూపొందించింది. హానికరమైన పదార్థాలతో తయారీ.. చైనా నుంచి దిగుమతైన హోలీ రంగులు, స్ప్రింక్లర్ల ధరలు దేశీయంగా తయారైన వాటికంటే దాదాపు 55 శాతం చౌకగా దొరుకుతున్నాయని నివేదికను విడుదల చేసిన సందర్భంగా అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. వినియోగదారుల్లో ఆసక్తి లేకపోవడంతో దేశవాళీ సంప్రదాయ పిచికారీలు దాదాపు కనుమరుగైపోయాయని వివరించారు. చైనా నుంచి దిగుమతయ్యే చౌక వాటర్ గన్స్ మొదలైన వాటి తయారీలో చర్మానికి హాని చేసే యాసిడ్స్, డీజిల్, ఇంజిన్ ఆయిల్, గాజు పౌడరు, మైకా వంటి హానికారక పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అసోచాం సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ఇలాంటి ప్రమాదకరమైన పదార్థాలతో తయారైనప్పటికీ చౌకగా దొరుకుతుండటం వల్ల చైనా ఉత్పత్తుల వైపే కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మెరుగైన హెర్బల్ రంగులనే తయారు చేస్తున్నప్పటికీ.. ముడి వస్తువుల ధర పెరిగిపోవడంతో వీటి రేట్లు కాస్త ఎక్కువే నిర్ణయించక తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ పరిణామాల కారణంగా చైనా చౌక దిగుమతులతో పోలిస్తే తమ ఉత్పత్తులకు కష్టంగా ఉంటోందని వివరించారు. అసోచాం అంచనా ప్రకారం దేశీయంగా 5,000 పైచిలుకు రంగుల తయారీ యూనిట్లు, అయిదు లక్షల కిలోల పైచిలుకు ‘గులాల్’ రంగును తయారు చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఏకంగా రెండు లక్షల కిలోల గులాల్ను వినియోగిస్తారు.