మేకిన్ ఇండియాలో భాగం కండి
- చైనా పెట్టుబడిదారులకు రాష్ట్రపతి ప్రణబ్ ఆహ్వానం
- చైనాలోనూ భారత ఉత్పత్తులు పోటీ పడాలి
గాంగ్జౌ: భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తామని, ‘మేకిన్ ఇండియా’లో చైనా పరిశ్రమలు భాగస్వామ్యం కావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా బుధవారం గ్వాంగ్జౌ భారత్-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు లాభించేలా కంపెనీల ప్రయత్నాల్ని సులభతరం చేస్తామని హామీనిచ్చారు. రెండు దేశాల ఆర్థికాభివృద్ధి కోసం అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం సమతూకం కోసం భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్‌గా మారేందుకు ప్రయత్నాలు సాగాలన్నారు.
ఇరు దేశాలు ఔషధాలు, ఫార్మా, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పరం ఆధారపడ్డాయని, ఈ రంగాల్లో భారత్ ఉత్పత్తులు చైనాలో పోటీపడాలని ఆకాంక్షించారు. భారత, చైనాల మధ్య ద్వైపాక్షిక వర్తకం 2000వ సంవత్సరంలో రూ. 19,497 కోట్లుగా ఉంటే 2015 నాటికి రూ.4.76 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా భారత్ ప్రతీ ఏటా 7.6 చొప్పున వృద్ధి రేటు సాధిస్తోందని వివరించారు.
విదేశీ పెట్టుబడుల కోసం సంస్కరణలు
భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో భారీ సంస్కరణలు చేపట్టామని, దీంతో వ్యాపారం సులభమైందని, విధానాల్లో మార్పులు చేసి పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించామని చెప్పారు. విదేశీ పెట్టుబడుదారుల కోసమే ఈ సంస్కరణలు చేపట్టామన్నారు. 2014లో విదేశీ పెట్టుబడుల్లో 32 శాతం వృద్ధి సాధించామని, 2015లో ప్రపంచంలోని భారీగా పెట్టుబడులు ఆకర్షించిన దేశాల్లో భారత్ ఒకటిగా అవతరించిందని తెలిపారు. చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని భారత్ కోరుకుంటుందని, పారిశ్రామిక కారిడార్‌లు, జాతీయ పెట్టుబడులు తయారీ జోన్‌లు, సరకు రవాణా కారిడార్‌ల్లో ఎఫ్‌డీఐలు పెట్టాలని రాష్ట్రపతి కోరారు. 100 స్మార్ట్ నగరాల కార్యక్రమం భారత్ స్వరూపాన్ని మార్చనుందని, ఈ పథకంలో పాలుపంచుకోవాలని సూచించారు. చైనా-భారత్‌లు పాత సంబంధాల పునరుద్ధరణకు కొత్తగా చేతులు కలపాలన్నారు. కార్యక్రమలో భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామికవే త్తలు కూడా పాల్గొన్నారు.
నేడు చైనా అధ్యక్షుడితో భేటీ
గాంగ్జౌలో ప్రణబ్ పలువురు కమ్యూనిస్టు నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి గౌరవార్ధం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి హ్యు చున్హువా మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా, భారత్‌ల్లో దేశం, రాష్ట్రాల సంబంధాలపై చర్చించారు. నేడు బీజింగ్‌లో ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.