China Industry
-
చైనా కంపెనీ విషయంలో భారత్ కీలక నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'బివైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) హైదరాబాద్‌కి చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం చైనా సంస్థ మన దేశంలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రతి పాదనను కేంద్రం నిరాకరించింది. భద్రత పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇప్పటికే బివైడీ కంపెనీ ఈ6, ఆటో వంటి కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా త్వరలోనే మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సమయంలో కేంద్రం ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, కేంద్ర కూడా దీనికి అనుమతిస్తుంది. -
టారిఫ్‌లపై దూకుడు వద్దు!!
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించగా... ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు దేశాధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే టారిఫ్‌లను పెంచేసింది. ఓ ఒప్పందానికి రాకపోతే మిగిలిన 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కూడా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. ఇలా చేస్తే బాణసంచా ధరలు పెంచాల్సి వస్తుందని, తద్వారా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుందని న్యూ హాంప్‌షైర్ ఫైర్వర్క్స్ అనే కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, దీనివల్ల అమెరికాలోని చిన్న పట్టణాల్లో జూలై 4 నాటి స్వాతంత్య దినోత్సవ సందర్భంగా బాణసంచా సంబరాలను రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఈ కంపెనీ హెచ్చరించింది. ఇక మిన్నెసోటాకు చెందిన ఓ మోటార్‌సైకిల్ కంపెనీ కూడా... చైనా విడిభాగాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యాపారాన్ని ఎత్తుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లాస్ ఏంజెలిస్‌కు చెందిన గృహోపకరణాల డిజైనర్, పంపిణీ కంపెనీ అయితే, ఉద్యోగ నియామకాలను నిలిపేయాల్సి వస్తుందని, అలాగే, గిడ్డంగుల భారీ విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయని పేర్కొంది. పోటీలో నిలవలేం... చైనా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఉత్పత్తిపైనా 25 శాతం టారిఫ్‌లు విధించే ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయాలను కోరగా... టారిఫ్‌లను పెంచే విషయంలో ముందుకు వెళ్లకపోవటమే మంచిదన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించనుంది. ఇప్పటికే వందలాది కంపెనీలు, వాణిజ్య బృందాలు, వ్యక్తులు అక్కడి ప్రభుత్వానికి లేఖల రూపంలో సూచనలు చేస్తూ... అదనపు టారిఫ్‌ల వల్ల వినియోగదారులపై ధరల భారం పడుతుందని స్పష్టంచేశారు. లాభాలను కోల్పోవడంతో పాటు అమెరికన్ కంపెనీలు, చైనా నుంచి కీలక విడిభాగాలను కొనుగోలు చేసే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడలేక, వ్యాపార అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
మేకిన్ ఇండియాలో భాగం కండి
- చైనా పెట్టుబడిదారులకు రాష్ట్రపతి ప్రణబ్ ఆహ్వానం - చైనాలోనూ భారత ఉత్పత్తులు పోటీ పడాలి గాంగ్జౌ: భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తామని, ‘మేకిన్ ఇండియా’లో చైనా పరిశ్రమలు భాగస్వామ్యం కావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా బుధవారం గ్వాంగ్జౌ భారత్-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు లాభించేలా కంపెనీల ప్రయత్నాల్ని సులభతరం చేస్తామని హామీనిచ్చారు. రెండు దేశాల ఆర్థికాభివృద్ధి కోసం అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం సమతూకం కోసం భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్‌గా మారేందుకు ప్రయత్నాలు సాగాలన్నారు. ఇరు దేశాలు ఔషధాలు, ఫార్మా, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పరం ఆధారపడ్డాయని, ఈ రంగాల్లో భారత్ ఉత్పత్తులు చైనాలో పోటీపడాలని ఆకాంక్షించారు. భారత, చైనాల మధ్య ద్వైపాక్షిక వర్తకం 2000వ సంవత్సరంలో రూ. 19,497 కోట్లుగా ఉంటే 2015 నాటికి రూ.4.76 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా భారత్ ప్రతీ ఏటా 7.6 చొప్పున వృద్ధి రేటు సాధిస్తోందని వివరించారు. విదేశీ పెట్టుబడుల కోసం సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో భారీ సంస్కరణలు చేపట్టామని, దీంతో వ్యాపారం సులభమైందని, విధానాల్లో మార్పులు చేసి పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించామని చెప్పారు. విదేశీ పెట్టుబడుదారుల కోసమే ఈ సంస్కరణలు చేపట్టామన్నారు. 2014లో విదేశీ పెట్టుబడుల్లో 32 శాతం వృద్ధి సాధించామని, 2015లో ప్రపంచంలోని భారీగా పెట్టుబడులు ఆకర్షించిన దేశాల్లో భారత్ ఒకటిగా అవతరించిందని తెలిపారు. చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని భారత్ కోరుకుంటుందని, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ పెట్టుబడులు తయారీ జోన్లు, సరకు రవాణా కారిడార్‌ల్లో ఎఫ్‌డీఐలు పెట్టాలని రాష్ట్రపతి కోరారు. 100 స్మార్ట్ నగరాల కార్యక్రమం భారత్ స్వరూపాన్ని మార్చనుందని, ఈ పథకంలో పాలుపంచుకోవాలని సూచించారు. చైనా-భారత్‌లు పాత సంబంధాల పునరుద్ధరణకు కొత్తగా చేతులు కలపాలన్నారు. కార్యక్రమలో భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామికవే త్తలు కూడా పాల్గొన్నారు. నేడు చైనా అధ్యక్షుడితో భేటీ గాంగ్జౌలో ప్రణబ్ పలువురు కమ్యూనిస్టు నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి గౌరవార్ధం గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి హ్యు చున్హువా మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా, భారత్‌ల్లో దేశం, రాష్ట్రాల సంబంధాలపై చర్చించారు. నేడు బీజింగ్‌లో ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.