'కల్తీ మద్యం నిందితులకు ఉరిశిక్ష వేయాలి'
ముంబై (మహారాష్ట్ర): కల్తీ మద్యం కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ముంబైలో కల్తీ మద్యం సేవించిన కారణంగా 102 మృతిచెందిన కేసులో ప్రధాన నిందితుడు మన్సూర్ లతీఫ్ షేక్ అలియాస్ అతిఖ్ ను న్యూఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. నిందితులకు సాధ్యమైనంత పెద్ద శిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అతిఖ్ గుజరాత్ నుంచి మిథనాల్ ను ముంబైకి సరఫరా చేస్తుంటాడని సమాచారం. 102 మంది మృతిచెందడంతో అతిఖ్ జూన్ 17 నుంచి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే బృందాలుగా సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన ముంబై, న్యూఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. పశ్చిమ ముంబైలోని మాల్వని కాలనీలో జరిగిన ఈ కల్తీ మద్యం ఘటనపై మూడు నెలల్లో నివేదిక అందిచనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి ఏక్ నాథ్ ఖాడ్సే తెలిపారు.