త్వరలో మరో వ్యాక్స్ మ్యూజియం!
రాజస్థాన్‌లోని నహర్‌గఢ్ కోట త్వరలో వ్యాక్స్ వెలుగులు కురిపించనుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మైనపు, సిలికాన్ విగ్రహాల ప్రదర్శనకు ఈ కోట నిలయంగా మారనుంది. ప్రసిద్ధ వ్యక్తులు, సాంస్కృతిక చిహ్నాలు, బాలీవుడ్ హాలీవుడ్ నటులు, క్రీడలు, చరిత్ర, సంగీతం, సాహిత్యంతో పాటు పాప్ స్టార్ల మైనపు విగ్రహాలను పర్యాటకులు, సందర్శకులు అతి దగ్గరగా వీక్షించేందుకు త్వరలో జైపూర్ వ్యాక్స్ మ్యూజియం సిద్ధమౌతోంది.
రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్‌లో గల నహర్‌గఢ్ కోటలో త్వరలో వ్యాక్స్ మ్యూజియం ప్రారంభం కానుంది. పర్యాటకులను ఆకట్టుకునే దిశగా చర్యలు చేపట్టిన పురావస్తు సంగ్రహాలయాల శాఖ ఇప్పటికే ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శించాలని నిర్ణయించగా.. తాజాగా వ్యాక్స్ విగ్రహాల ప్రదర్శనకూ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. వారసత్వ నిర్మాణాలకు, కోటలకు నెలవైన జైపూర్.. ప్రపంచంలోనే మూడో కేంద్రంగా గుర్తింపు పొందింది. రాత్రిపూట పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పటికే నగరంలో ఆల్బర్ట్ హాల్ మ్యూజియంను ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాక్స్ మ్యూజియం ఏర్పాటుతో సందర్శకులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
లండన్‌లోని సుప్రసిద్ధ మేడమ్ టస్సాడ్స్ మ్యూజియం తరహాలో వ్యాక్స్ మ్యూజియంలు పలుచోట్ల ప్రారంభమయ్యాయి. మన దేశంలో పుణె సమీపంలోని లోనావాలలో కూడా వ్యాక్స్ మ్యూజియం ఉంది. అక్కడ కూడా పలువురు ప్రముఖుల మైనపు విగ్రహాలున్నాయి.