సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకులు పెళ్లి చేసుకోని పిల్లా పాపలతో కళకళలాడుతు నిండు నూరేళ్లు జీవించాలన్నది మొన్నటి మాట. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని అత్తా మామలకు దూరంగా ఉండాలన్నది నిన్నటి మాట. పెళ్లి పెటాకులు కాకముందే కలిసున్న నాలుగు రోజులైన గుర్తుండేలా ఆ పెళ్లి ఫొటోలు ఉండాలన్నది నేటి యువతీ యువకుల మాట. అందుకోసమే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అవుట్ డోర్‌లో అందమైన ఫొటోలు తీసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. అలా అదే తరహాలో కేరళలోని కోచికి గంట దూరంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు బిచూలు తమ పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బిచూ ప్రతాపన్ పెరంట్లో ఉన్న ఓ చిన్న కుంటలో పై నుంచి వర్షపు జల్లులు కురుస్తుండగా ‘ఉరిలి’గా పిలిచే పెద్ద జబ్బతట్టలో బిచూ, ఇందులు పరస్పరం అభిముఖంగా ఒరిగారు. ఆకాశం నుంచి కురుస్తున్న చిరు జల్లులు చల్లగా మొహం మీద పడుతూ మంచు ముత్యాల్లా ఎగిరి పడుతుంటే అంతులేని తన్మయత్వంలో వారిద్దరూ మునిగి తేలుతున్నట్లు ఉంది ఆ ఫొటో. అందుకే అది వైరల్ అవుతోంది. అప్పుడు నిజంగా వర్షం కురవలేదు. అంత ఆనందాన్ని కూడా వారు అనుభవించి ఉండరు. అలా ఆ ఫొటోను తీసిందీ దశాబ్దం పాటు వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న షైన్ సిద్ధార్థ్. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అవుట్ డోర్‌లో అంటే, ఆరుబయట చెట్ల కింద, చెరువు గట్టుపై చెంగల్వ పూతోటలో, నదీ తీరాన ఇసుక తిన్నెలపై, సముద్రపు అలల అంచున ఫొటోలు దిగేందుకు ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు.
‘కేరళలో పెళ్ళిళ్లు అతి త్వరగా ముగుస్తాయి. ఐదు నుంచి 15 నిమిషాల్లో తతంగమంతా అయిపోతుంది. ఈ తతంగంలో ఆకట్టుకునే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలి. కొన్ని క్షణాల్లో కొన్ని ఫొటోలను మిస్సయ్యే ప్రమాదం ఉంది. అందుకేనేమో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అవుట్ డోర్ ఫొటో షూటింగ్‌లు మొదలయింది. అవసరం అదే కావచ్చుగానీ స్ఫూర్తి మాత్రం మలయాళ సినిమాల నుంచి వచ్చిందేనని చెప్పవచ్చు’ అని వసీమ్ అహ్మద్ అనే ఫొటోగ్రాఫర్ తెలిపారు. ఆయన చెన్నైలో ప్రత్యేక వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లతో ఏర్పాటయిన ‘మేడిన్ మోనో’ సంస్థ సహ వ్యవస్థాపకుడు. తాను తరచుగా కేరళకు వెళ్లే పెళ్లి ఫొటోలు తీస్తుంటానని చెప్పారు.
ఐదు నుంచి పది లక్షల రూపాయలు
పెళ్లి సందర్భంగా కొత్త దంపతులు, వారు బంధు మిత్రులను మూడు రోజులపాటు ఫొటోలు తీయడానికి తాము ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు తీసుకుంటామని, తమ బృందంలో ఐదారుగురు ఫొటోగ్రాఫర్లు ఉంటారని వసీమ్ అహ్మద్ తెలిపారు. పది వేల నుంచి 20 వేల వరకు ఫొటోలు తీస్తామని, వాటిల్లో మంచివనుకున్నవి రెండు వేల నుంచి రెండున్నర వేల వరకు ఎంపిక చేసి కస్టమర్లకు ఇస్తామని ఆయన చెప్పారు. తమ బృందంలో ఒక్కో ఫొటోగ్రాఫర్ వ్యక్తిగతంగా 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 35 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
ఉత్తరాదికి దక్షిణాదికి ఎంతో తేడా
దక్షిణాదిలో మొదటి నుంచి చివరి వరకు వధూవరులపైనే కెమెరాల దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. పెళ్లికి వచ్చిన, వస్తున్న అతిథులను, భోజనం చేసేటప్పుడు వారి హావభావలను తీయడం మామూలుగా ఉంటుంది. ఉత్తరాదిలో పెళ్లి వేడుకలతోపాటు పార్టీ జరుగుతున్న తీరు, అంకుల్స్, ఆంటీల డ్యాన్స్‌కు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుందని ఈ స్పెషలిస్ట్ ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు. నేడు పెళ్లిళ్లన్నవి దేశంలో ఏటా లక్ష కోట్ల రూపాయల వ్యాపారమని అసోచామ్ 2017లో ఓ నివేదికలో వెల్లడించింది. ఒక్క కేరళలోనే పెళ్లికి కొనే బంగారాన్ని కలుపుకొని ఏటా పది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నదట. కేరళలో తలసరి సగటున నెలకు 400 రూపాయలను బంగారంపై ఖర్చు చేస్తున్నారట. ఇక ప్రతి పెళ్లికి రెండు గ్రాముల నుంచి కిలో వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారట.
ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి!
కొన్ని జంటలు కొండ శిఖరాగ్రాలపై, కొందరు సముద్రపు అలలపై, మరికొందరు చెట్ల తోపులతో తులతూగే సరస్సులో ఫొటోలు తీసుకోవాలనుకుంటారని కొట్టాయంలోని కేరళ వెడ్డింగ్ ఫొటోగ్రఫి సంస్థ వ్యవస్థాపకులు సంజీవ్ వర్గీస్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే షూటింగ్ సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కేరళ పర్యాటక ప్రాంతాల్లో ఫొటోలు తీయాలంటే ముందుగా మున్సిపాలిటీ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ప్రతిభా ఎంవీ, ఈశ్వర్ కే. దంపతులు గతేడాది నవంబర్ నెలలో తమను సంప్రతించారని, ప్రముఖ వెంబనాడ్ సరస్సులో వారు ఫొటోలు దిగాలనుకున్నారని, అందుకు తాము రెండు నాటు పడవలను అద్దెకు తీసుకొని సరస్సులో వెళ్లామని చెప్పారు. ఆరోజున వారిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీయడానికి ఏడెనిమిది గంటలు పట్టిందని తెలిపారు.
కేరళలోనే ఈ ట్రెండ్ ఎక్కువ
పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ప్రత్యేక ఫొటో షూటింగ్‌లకు కేరళ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి కొండలు, గుట్టలు, నదులతో కూడిన ప్రాకృతిక సౌందర్యమే కారణమని చెన్నైకి చెందిన మరో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ వినయ్ అరవింద్ తెలిపారు. సోషల్ మీడియా విస్తరించిన నేపథ్యంలో ఇలాంటి ఫొటోలకు డిమాండ్ మరింత పెరిగిందని ఆయన చెప్పారు. కేరళ పెళ్లి ఫొటోల ఫేమ్ గురించి తెలిసి విదేశీ జంటలు కూడా ఇప్పుడు వెడ్డింగ్ ఫొటోల కోసం వస్తున్నారని ఆయన చెప్పారు. ఫొటోలు ఆకాశం నుంచి తీసినట్లు ఉండాలనుకుంటే ఇది వరకు పెద్ద పెద్ద క్రేన్లు ఉపయోగించాల్సి వచ్చేదని, ఇప్పుడు ద్రోణ్ కెమేరాలు రావడంతో ఆ బాధ తప్పిందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment