
భారత్, పాక్ మధ్య యుద్ధమే వస్తే...?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం తప్పకపోవచ్చని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దసరా పండుగ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితే తలెత్తితే ఇరువైపుల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది.
పాకిస్థాన్, భారత్‌కు మధ్య ఇప్పటివరకు 1948, 1965, 1971, 1999 సంవత్సరాల్లో జరిగిన నాలుగు యుద్ధాల్లో ఇరువైపులు దాదాపు 23 వేల మంది సైనికులు మరణించగా, లక్ష పౌర కుటుంబాల్లో కనీసం ఒకరు మరణించారు. ఈ నాలుగు యుద్ధాల కారణంగా భారత ఆర్థిక సామర్థ్యం మూడు శాతం దెబ్బతిన్నదని ‘స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్’ అంచనా వేసింది.
ప్రస్తుతం భారత్, పాక్ దేశాలు అణ్వస్త్రాలు కలిగి ఉన్నందున ఈసారి యుద్ధం జరిగితే ఇరు దేశాల్లో అపార ఆస్తి, ప్రాణ నష్టాలతోపాటు ప్రకృతికి తద్వారా ప్రపంచానికి ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఇరు దేశాల మధ్య 200లకుపైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 15 కిలోటన్ హిరోషిమా బాంబుకు సమానం. వీటిలో ఇరు దేశాలు వంద అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఇరువైపుల 2.10 కోట్ల మంది పౌరులు మరణిస్తారని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ, రటగర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారిలో దాదాపు సగం మంది చనిపోతారన్న మాట.
ఇక అణ్వస్త్రాల వల్ల ప్రకృతిపరంగా నష్టం అపారం. ప్రపంచవ్యాప్తంగా సగం ఓజోన్ పొర దెబ్బతింటుంది. అతి రేడియేషన్ కారణంగా భూ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. రుతుపవనాలు దెబ్బతింటాయి. తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు తీవ్ర కరవు పరిస్థితులలో అలమటిస్తారని ‘ఇంటర్నేషనల్ ఫిజిషియన్స్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్’ అనే అంతర్జాతీయ సంస్థ 2013లో అంచనా వేసింది. ఆటమిక్ సైంటిస్ట్‌ల బులిటెన్ వెల్లడించిన నివేదిక ప్రకారం పాకిస్థాన్ వద్ద 110 నుంచి 130 వరకు, భారత్ వద్ద 110 నుంచి 120 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి.
పాకిస్థాన్ వద్దనున్న అణ్వస్త్రాల్లో 66 శాతం అణు శీర్షాలను 86 భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగలవు. వాటిలో హతాఫ్ సిరీస్ ఒకటి ముఖ్యమైనది. ప్రవక్త మొహమ్మద్ పేరును సూచించేలాగానే హతాఫ్ అని దానికి పేరు పెట్టారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేస్తున్న హతాఫ్ సిరీస్ ఇంకా ప్రయోగాల దశల్లోనే ఉంది. పాకిస్థాన్ వద్దనున్న మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు భారత దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లక్ష్యాలను ఛేదించగలవని ముంబైలోని ‘నేషనల్ సెక్యురిటీ, ఎత్నిక్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ టైజమ్’ ఫెల్లో సమీర్ పాటిల్ తెలిపారు. 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే మొహమ్మద్ ఘోరి పేరిట నిర్మించిన ఖండాంతర క్షిపణులు పాక్ వద్ద 40 ఉన్నాయని, అవి ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, నాగపూర్, భోపాల్, లక్నో లక్ష్యాలను ఛేదించగలవని బెంగళూరులోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్’కు చెందిన నిపుణులు గతంలో ఓ నివేదికలో వెల్లడించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే 2,500 కిలోమీటర్లు ప్రయాణించే శక్తి గల దూర శ్రేణి షహీన్ ఖండాంతర క్షిపణుల కూడా పాక్ వద్ద ఎనిమిది ఉన్నాయని, ఇవి కోల్‌కతా సహా భారత్‌లోని అన్ని నగరాల లక్ష్యాలను ఛేదించగలవని వారు తెలిపారు.
ఇక పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచి, రావల్పిండి, ముల్తాన్, పెషావర్, క్వెట్టా, గ్వాడర్ సహా అన్ని నగరాల లక్ష్యాలను ఛేదించే అణు క్షిపణలు భారత్ వద్ద కూడా భారీగానే ఉన్నాయి. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణితోపాటు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పుధ్వీ, అగ్ని సిరీస్ క్షిపణులు భారత్ వద్ద ఉన్నాయని ఆటమిక్ సైంటిస్ట్స్ బులిటెన్ వెల్లడిస్తోంది. అణ్వాస్త్రాలను ప్రయోగించే సాగరిక జలాంతర్గామితోపాటు అణు శీర్షాలను ప్రయోగించి జాగ్వార్ ఫైటర్ బాంబర్ విమానాలు మనవద్ద ఉన్నాయి. పాకిస్థాన్‌కు జలాంతర్గామి లేకపోవడం గమనార్హం.