
భార్య ఫిర్యాదుతో భర్త బాగోతం బట్టబయలు
బెంగళూరు: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని ఓ యువతిని నమ్మించి వివాహం చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మైసూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పరసయ్యహుండి గ్రామానికి చెందిన శివమూర్తి అనే యువకుడు నగరానికి చెందిన దేవిక అనే యువతిని పరిచయం చేసుకొన్నాడు. తాను డీఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానంటూ ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత తాను సిద్ధం చేసుకున్న నకిలీ ఐడీ కార్డు, యూనిఫాంతో విధులకు వెళ్తున్నట్లు నటించేవాడు.
అదే విధంగా ఇతరుల వద్ద కూడా తనను తాను పోలీస్ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకొని రూ. 2 కోట్ల మేరకు అప్పులు చేశాడు. పెళ్లై ఇంత కాలమైనా తాను ఏ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నది చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన దేవిక, భర్త ఉద్యోగం గురించి వాకబు చేయగా మోసం చేశాడని తేలింది. భర్తపై మైసూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం శివమూర్తిని అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.