ఆ భార్యాభర్తలిద్దరు చిట్టచివరి క్షణం వరకు కలిసే ఉన్నారు. చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారు.
ఆ భార్యాభర్తలిద్దరు చిట్టచివరి క్షణం వరకు కలిసే ఉన్నారు. చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారు. విమానంలో వెళ్తున్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటు వచ్చి మరణించగా.. అది చూసి తట్టుకోలేక షాక్ తిన్న భర్త కూడా వెంటనే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. రాజస్థాన్లోని చురు ప్రాంతానికి చెందిన ప్రేమలత (65) తన భర్తతో కలిసి ఢిల్లీ నుంచి గువాహటికి విమానంలో బయల్దేరారు. వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బంధువులు కూడా అదే విమానంలో ఉన్నారు.
ప్రయాణం మొదలైన కొద్ది సేపటికే తనకు గుండెలో నొప్పిగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పైలట్కు చెప్పగా, విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. వెంటనే ప్రేమలతను అక్కడుకు సమీపంలోని మాక్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ, తీసుకొచ్చేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ విషయం తెలిసిన కొద్దిసేపటికే ఆమె భర్త శాంతిలాల్ జైన్ (75) షాక్తో కుప్పకూలిపోయారు. వైద్యులు పరిశీలించి, ఆయన కూడా మరణించినట్లు చెప్పారు!!