'మా కుటుంబం చిన్నాభిన్నమైంది'
చెన్నై: గత వారం చెన్నై నుంచి బయల్దేరిన కోస్ట్ గార్డ్ డోర్నియర్ విమానం అదృశ్యమైన ఘటనపై డిప్యూటీ కమాండెంట్ సుభాష్ సురేష్ భార్య దీపా సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ విమానం ఆచూకీ జాడ తెలియకపోవడంతో తమ కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నంగా మారిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో సందేశం పంపారు. ఇప్పటికైనా విమానం అదృశ్యంపై మోదీ జోక్యం చేసుకుంటే ఆచూకీ లభించే ఆస్కారం ఉందని దీప ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 8 వ తేదీ ఉదయం అంటే విమానం అదృశ్యానికి కొన్ని నిముషాల ముందు తన భర్తతో చివరి సారి మాట్లాడానన్నారు.
'ఈ ఘటనపై మా కుటుంబం తీవ్ర ఆందోళనగా ఉంది. చెన్నై నుంచి బయల్దేరిన కోస్ట్ గార్డ్ విమానం సరిగ్గా ఎనిమిదిరోజుల క్రితం తప్పిపోయింది. ఆ విమానం దోహా నుంచి చెన్నై కు వచ్చే క్రమంలోనే అదృశ్యమైందని అనుకుంటున్నాం. విమాన అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టినా ఎటువంటి వివరాలు తెలియడం లేదు. ఈ ఘటనపై పీఎం కార్యాలయం నుంచి కూడా ఏ విధమైన సమాచారం లేదు. మోదీ కల్పించుకోవాలి. 14 నెలల బాబుతో ఉన్న మాకు ఏ ఒక్కరి వద్ద నుంచైనా భర్త జాడ తెలుస్తుందేమో 'అని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు దీప తెలిపారు.
గత సోమవారం తమిళనాడు తీరంలో ఉన్న పాల్క్ బే వద్ద నిఘా కోసం కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి బయల్దేరిన విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. 10 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడలు, 4 భారత్ నావిక దళాలతో గాలింపు చర్యలు చేపట్టినా విమాన జాడ కనిపించలేదు.గల్లంతైన కోస్ట్ గార్డ్ విమానంలో డిప్యూటీ కమాండెంట్ (పైలట్) విద్యాసాగర్, కో పైలట్, డిప్యూటీ కమాండెంట్ సుభాష్ సురేష్, నావిగేటర్ ఎంకె సోనీ ఉన్నారు.