ప్రతియేటా ఇలా నీళ్లు నిలిస్తే ఊరుకోం: హైకోర్టు
''ప్రతియేటా ఇలాగే జరుగుతుంటే మేం సహించేది లేదు'' అని ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉండటంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నీళ్లు నిలిచిపోయిన పరిస్థితిపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ఢిల్లీ సర్కారును తీవ్రంగా తప్పుబట్టారు. నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల విషయంలో పరిధి అంటూ ఏమీ ఉండదని, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే మాత్రం తాము సహించేది లేదని కోర్టు ఘాటుగా హెచ్చరించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా నిలిచిపోవడంతో కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుంది. తాను ఉదయం కోర్టుకు వస్తుంటే ఉపరాష్ట్రపతి నివాసం ఎదుట కూడా నీళ్లు నిలిచిపోయి ఉండటం కనిపించిందని కేసును విచారించిన న్యాయమూర్తి అన్నారు.
ఢిల్లీలో డ్రైనేజి వ్యవస్థ ఏమాత్రం బాగోలేకపోవడంతో డ్రెయిన్లలో దోమలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయని, దానివల్ల డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని కూడా న్యాయమూర్తి అన్నారు. దక్షిణ ఎక్స్‌టెన్షన్ పార్ట్ -1, సమీపంలో ఉన్న కుశాక్ నల్లా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయిన ఫొటోలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దక్షిణ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో డ్రైనేజి వసతి సరిగా లేకపోవడం వల్ల అక్కడి నీళ్లే కుశాక్ నల్లాప్రాంతాన్ని కూడా ముంచెత్తినట్లు ఫొటోల వల్ల తెలుస్తోందని అన్నారు. దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ జలబోర్డులకు కోర్టు నోటీసులు జారీచేసింది. నిలిచిపోయిన నీళ్లను ఎప్పటికప్పుడు పోయేలా చూడాలని తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.