
యూపీలో మరో దారుణం
ముజఫర్నగర్ : ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. భూవివాదాల నేపథ్యంలో ఓ యువతిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసేందుకు యత్నించిన ఘటన గడవకముందే, షామ్లి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న రైల్లోంచి ఓ మహిళను గుర్తుతెలియని దండుగులు బయటకు తోసివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే అధికారి అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షామ్లి జిల్లాలోని ఢిల్లీ-సహరనపూర్ మార్గంలో బుద్ధపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో నడుస్తున్న రైల్లోంచి ఓ మహిళను బయటకు తోసివేశారు.
తీవ్రగాయాలతో రైల్వే ట్రాక్ పక్కన అపస్మారకస్థితిలో పడివున్న మహిళను ఓ స్థానికుడు గమనించి షామ్లిలోని ఓ ఆస్పత్రికి తరలించాడు. ఆ మహిళ వయసు సుమారు 35 ఉంటుందని, ఆమె పరిస్థితి చూస్తే రైల్లోంచి ఎవరో ఆమెను తోసివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని షామ్లి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాధిత మహిళ ఇంకా తెలియలేదని రైల్వే అధికారి అజయ్ కుమార్ వెల్లడించాడు.