
సాఫీగా సాగిన పరుగు పరీక్ష
- సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు
- అయినప్పటికీ అస్వస్థతకు గురైన ఐదుగురు
- వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు
సాక్షి, ముంబై: మహిళా పోలీసు భర్తీ ప్రక్రియలో భాగంగా విక్రోలీలో మంగళవారం నిర్వహించిన మూడు కిలోమీటర్ల పరుగు పరీక్షలో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. స్వల్పంగా గాయపడడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో వెంటనే సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 1,770 మంది మహిళలు ఈ పరుగు పరీక్షలో పాల్గొన్నారు. కౌసర్ మెహబూబ్, సారికా కాంబ్లే, వైశాలీ గోరే డీహైడ్రేషన్‌కు లోనయ్యారని, ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉందని, స్వల్ప గాయాలైన మరో ఇద్దరికి కూడా చికిత్స చేసి పంపామని వైద్యులు తెలిపారు.
సాయంత్రం వేళల్లోనే పరుగు పరీక్ష..
పై అధికారుల ఆదేశాల మేరకు పరుగు పరీక్షను మండుటెండలో కాకుండా సాయంత్రం సమయంలోనే నిర్వహించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పరుగు పరీక్షలో పాల్గొనడానికి ముందే అభ్యర్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. పరుగు పరీక్షలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు జేజే ఆస్పత్రికి చెందిన 30 మంది వైద్యులను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్(ఓఆర్‌ఎస్) అనే సంస్థ అభ్యర్థులకు అరటి పండ్లు, నీళ్ల సీసాలు, బిస్కెట్లను అందజేసింది.
సౌకర్యాలు బాగున్నాయి...
పరుగుపరీక్ష కోసం మధ్యాహ్నమే తాము వచ్చినా అక్కడ భోజనం, తాగునీరు వంటివి ఏర్పాటు చేశారని పుణే నుంచి వచ్చిన సోనాలీ దావ్రే పేర్కొన్నారు. పుణే, సతారా, బారామతి నుంచి ఈ టెస్టులో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారని చెప్పారు.
అయితే నగరానికి చేరుకోవడానికి రాత్రి మొత్తం ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ ఉండాలని చెప్పడంతో సాంగ్లీ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి రాత్రి మొత్తం ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల కోసం 2,570 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో 30 శాతం మహిళలకు కేటాయించారు.